ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో ఇంటికే డెలివరీ? ఆరోపిస్తున్న గ్రామస్తులు !
భిక్కనూరు, సెప్టెంబర్ 29 (నవజ్యోతి ప్రతినిధి): కాచాపూర్‌లో ‘బెల్టు’ దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం కోసం భిక్కనూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ‘ఫోన్ కొట్టు.. మద్యం పట్టు’ అన్నట్టుగా ఒక్క కాల్ చేస్తే ఐదు నిమిషాల్లోనే ఇంటి వద్దకు మద్యం చేరుతున్నట్లు గ్రామానికి చెందిన మర్రి మహిపాల్ ఆరోపిస్తున్నారు.
భిక్కనూరుకు వెళ్లి మద్యం తెచ్చుకోవడానికి సమయం పడుతుండగా.. కాచాపూర్‌లో ఫోన్ చేస్తే నిమిషాల్లోనే మద్యం అందుతోందనే స్థాయిలో బెల్టు వ్యాపారం సాగుతోందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో సుమారు 5 నుంచి 8 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళల్లోనూ విక్రయాలు జరుగుతున్నాయనే ప్రచారం గ్రామంలో ఉందని తెలిపారు.
ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో?
ఇంటి వద్దకే మద్యం డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మద్యం విక్రయాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ ప్రదేశాల్లో విక్రయాలు జరుగుతున్నాయి? అనధికారికంగా విక్రయాలు సాగుతున్నాయా? అనే అంశాలు అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల్లో తేలాల్సి ఉంది.
ముఖ్యంగా ఇంటి వద్దకే మద్యం డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో బెల్టు కేంద్రాల సంఖ్య, వాటికి మద్యం సరఫరా అవుతున్న తీరుపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
కాచాపూర్‌లో జరుగుతున్న మద్యం విక్రయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
స్థానికుల డిమాండ్: కాచాపూర్‌లో బెల్టు మద్యం విక్రయాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలి.