Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

కోల్‌కతాలో ఇండియా ఎనర్జీ వీక్‌ 2027!

జనవరి 28 నుంచి 31 వరకు.. 75 వేలకుపైగా ఎనర్జీ నిపుణుల రాక ‘ఇన్నోవేషన్‌ను అన్‌లాక్‌ చేద్దాం.. ఎనర్జీ భద్రతను సాధిద్దాం.. రేపటిని తీర్చిదిద్దుదాం’
SAI MANIKANTA
September 29, 2026 · 10 hours క్రితం
◉ 4 Views ↗ 1 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి):

ప్రపంచ ఇంధన రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియా ఎనర్జీ వీక్‌ 2027కు కోల్‌కతా వేదిక కానుంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్‌కతాను వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఐదో ఎడిషన్‌ ఇండియా ఎనర్జీ వీక్‌ 2027 జనవరి 28 నుంచి 31 వరకు కోల్‌కతాలోని న్యూ టౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది.

‘Unlocking Innovation. Securing Energy. Shaping Tomorrow.’ అనే థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సులో ఇంధన భద్రత, అందుబాటు ధరలు, సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడులు, సుస్థిర ఇంధన వ్యవస్థలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. విధాన నిర్ణేతలు, ఇంధన రంగ నిపుణులు, టెక్నాలజీ సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొననున్నారు.

75 వేలకుపైగా నిపుణులు.. 700కు పైగా ఎగ్జిబిటర్లు
120కుపైగా దేశాల భాగస్వామ్యంతో 2026లో జరిగిన IEW విజయాన్ని కొనసాగిస్తూ 2027 ఎడిషన్‌ను మరింత విస్తృతంగా నిర్వహించనున్నారు.

2027 ఎడిషన్‌కు 75,000కుపైగా ఇంధన రంగ నిపుణులు, 700కుపైగా అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 2026లో గోవాలో జరిగిన నాలుగో ఎడిషన్‌కు 120కుపైగా దేశాల నుంచి ప్రతినిధులు, 6,500కుపైగా కాన్ఫరెన్స్‌ డెలిగేట్లు హాజరయ్యారు. 17 మంది మంత్రులు, డిప్యూటీ మంత్రులు కూడా పాల్గొన్నారు.

కోల్‌కతాలో IEW నిర్వహించడం ద్వారా తొలిసారిగా తూర్పు భారతదేశానికి ఈ అంతర్జాతీయ ఇంధన వేదికను తీసుకెళ్తున్నారు. దీనివల్ల తూర్పు భారతదేశంలోని వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఇంధన రంగ భాగస్వాములకు అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానం అయ్యే అవకాశాలు పెరుగుతాయని కేంద్రం పేర్కొంది. ఈ సదస్సు ద్వారా పశ్చిమ బెంగాల్‌కు కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టుల విస్తరణ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సీఎం సువేందు అధికారి తెలిపారు.

చమురు నుంచి ఏఐ వరకు.. విస్తృత చర్చలు
ఆయిల్‌, గ్యాస్‌, ఎల్‌ఎన్‌జీ, రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌, హైడ్రోజన్‌, బయోఫ్యూయల్స్‌, డిజిటలైజేషన్‌, ఏఐ తదితర రంగాలపై ప్రదర్శనలు, చర్చలు జరగనున్నాయి.

ఇంధన రంగంలోని విస్తృత విలువ శ్రేణికి చెందిన సంస్థలకు IEW 2027 కీలక వేదికగా నిలవనుంది. చమురు, సహజవాయువు, ఎల్‌ఎన్‌జీ, రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌తో పాటు హైడ్రోజన్‌, బయోఫ్యూయల్స్‌, డిజిటలైజేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో జరుగుతున్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.

ప్రపంచ ఇంధన వ్యవస్థలో భారత్‌ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో IEW 2027లో ఇంధన భద్రత, అందుబాటు, సాంకేతికత, పెట్టుబడులు, సుస్థిరత వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు ఇంధన భద్రత, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడంపై భాగస్వామ్య అవకాశాలను చర్చించనున్నారు.

పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎనర్జీ వీక్‌ 2027ను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), ఇన్ఫార్మా మార్కెట్స్‌ కలిసి నిర్వహించనున్నాయి. జనవరి 28 నుంచి 31 వరకు కోల్‌కతాలో జరిగే ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ ఇంధన రంగంలో సాంకేతిక సహకారం, పెట్టుబడులు, భాగస్వామ్యాలపై కొత్త అవకాశాలను అన్వేషించనున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram