భువనేశ్వర్, సెప్టెంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి): ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 37 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ఇంజిన్ వైఫల్యం, బ్యాలస్ట్ ట్యాంకులోకి వేగంగా నీరు చేరడంతో ప్రమాదకరంగా ఒరిగిన బెలిజ్ జెండా కలిగిన కెమికల్ ట్యాంకర్ ఎంటీ సీగల్-9ను భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది సురక్షితంగా స్థిరీకరించారు.
సెప్టెంబర్ 27 ఉదయం సుమారు 7.30 గంటలకు ట్యాంకర్ నుంచి అత్యవసర సమాచారం అందడంతో ఐసీజీఎస్ విశ్వస్త్‌ను ఘటనాస్థలికి తరలించారు. కోస్ట్‌గార్డ్ డ్యామేజ్ కంట్రోల్ బృందం అస్థిరంగా ఉన్న నౌకపైకి చేరుకుని సబ్‌మెర్సిబుల్ డీ-వాటరింగ్ పంపులతో నీటిని బయటకు పంపింది. దెబ్బతిన్న రెండు సముద్రపు నీటి పైపులైన్లను మూసివేసి, మరో పైపులైన్‌లోని లీకేజీని నియంత్రించింది. దీంతో నౌక బోల్తా పడే ప్రమాదాన్ని నివారించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ట్యాంకర్‌లో 9 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉండగా, 23 మంది సిబ్బంది ఉన్నారు. రక్షణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు మరో ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌక, పొల్యూషన్ కంట్రోల్ నౌకను రంగంలోకి దించారు. భువనేశ్వర్ నుంచి ఐసీజీ డోర్నియర్ విమానాన్ని పంపి గగనతల నిఘా నిర్వహించారు.
సెప్టెంబర్ 27న నౌక సమీపంలో స్వల్పంగా కనిపించిన పామాయిల్ పొర.. సెప్టెంబర్ 28న నిర్వహించిన వైమానిక పరిశీలనలో పూర్తిగా కనుమరుగైనట్లు నిర్ధారించారు. సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు తలెత్తకుండా కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్నట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది.
నౌక స్థిరపడిన అనంతరం పారాదీప్ పోర్ట్ అథారిటీకి చెందిన డాల్ఫిన్ టగ్ దానిని పారాదీప్ సమీపంలోని యాంకరేజ్ ప్రాంతం వైపు లాక్కెళ్లింది. ఐసీజీఎస్ విశ్వస్త్‌తో పాటు ఇతర ప్రత్యేక బృందాలు అక్కడే కొనసాగుతూ నౌకకు రక్షణ కల్పిస్తున్నాయి.