Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ఆరోగ్యం

2027లో భారత్‌లోకి డెంగ్యూ వ్యాక్సిన్‌!

SAI MANIKANTA
September 18, 2026 · 4 days క్రితం
41 Views 1 Shares

క్యూడెంగా టీకాను విక్రయించనున్న డాక్టర్‌ రెడ్డీస్‌..4 నుంచి 60 ఏళ్ల వారికి అనుమతి-మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 (నవజ్యోతి ప్రతినిధి):

భారత్‌లో తొలిసారిగా అనుమతి పొందిన డెంగ్యూ వ్యాక్సిన్‌ క్యూడెంగా (QDENGA) 2027 ప్రథమార్థంలో ప్రైవేట్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్స్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం క్యూడెంగా వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రమోట్‌ చేసి పంపిణీ చేసే బాధ్యతను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ చేపట్టనుంది.

కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) 2026 జూలైలో క్యూడెంగా మార్కెటింగ్‌ అనుమతిని మంజూరు చేసింది. అయితే అవసరమైన స్థానిక నియంత్రణ ప్రక్రియలు పూర్తైన తర్వాతే వ్యాక్సిన్‌ ప్రైవేట్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 2027 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంస్థలు వెల్లడించాయి.

భారత్‌లో 4 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి క్యూడెంగా వినియోగానికి అనుమతి ఉంది. పిల్లలు – పెద్దలకు ప్రైవేట్‌ మార్కెట్‌లో టీకా ప్రమోషన్‌ – పంపిణీని డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహించనుంది. ప్రభుత్వ మార్కెట్‌లో క్యూడెంగా ప్రమోషన్‌ – పంపిణీ హక్కులు మాత్రం టకెడా వద్దే ఉంటాయి.

క్యూడెంగా అనేది నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ సెరోటైప్‌లకు రక్షణ కల్పించేలా రూపొందించిన లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టెట్రావాలెంట్‌ వ్యాక్సిన్‌. DENV-2 వైరస్‌ ఆధారంగా, DENV-1, DENV-3, DENV-4 వైరస్‌ల నిర్మాణ ప్రోటీన్లను ఉపయోగించి దీనిని అభివృద్ధి చేశారు.

ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోసు తర్వాత మూడు నెలలకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. టకెడా నిర్వహించిన ప్రపంచస్థాయి క్లినికల్‌ కార్యక్రమంలో డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉన్న ఎనిమిది దేశాల్లో 60 వేలకు పైగా మంది పాల్గొన్నారు.

టకెడా తెలిపిన వివరాల ప్రకారం, క్యూడెంగా 2022 నుంచి ఇప్పటివరకు భారత్‌ సహా 43 దేశాల్లో అనుమతి పొందింది. ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, మలేసియా, వియత్నాం, లాటిన్‌ అమెరికా – యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ – ప్రైవేట్‌ కార్యక్రమాల ద్వారా 3.2 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది.

భారత్‌లో గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరిగాయని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు సెరోటైప్‌లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు ఐసీఎంఆర్‌కు చెందిన వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీల జాతీయ స్థాయి అధ్యయనాన్ని సంస్థ ప్రస్తావించింది.

భారత్‌లో డెంగ్యూ కేసులు ఏడాది పొడవునా నమోదయ్యే అవకాశం ఉండటంతో నివారణ – ముందస్తు వైద్య నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతోంది. డెంగ్యూ వ్యాక్సిన్‌ను యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసినట్లు టకెడా తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిక డెంగ్యూ ప్రబలత ఉన్న దేశాల్లో క్యూడెంగాను టీకాకు ముందు స్క్రీనింగ్‌ లేకుండానే వినియోగించేందుకు సిఫారసు చేసిందని టకెడా వెల్లడించింది. WHO ప్రీక్వాలిఫైడ్‌ వ్యాక్సిన్ల జాబితాలోనూ క్యూడెంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.

భారత్‌లో ప్రస్తుతం క్యూడెంగా ప్రైవేట్‌ మార్కెట్‌ కోసం మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ సాధారణ టీకా కార్యక్రమంలో దీనిని చేర్చడం దీర్ఘకాలిక లక్ష్యమని టకెడా పేర్కొంది. టీకా విడుదలతో పాటు వైద్య నిపుణులకు అవగాహన – డెంగ్యూ నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు సంస్థలు తెలిపాయి.