సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ !
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మాడుగులపల్లి మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. పార్టీ నాయకులు – కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ప్రయాణించారు. ఈ సందర్భంగా పోరాట అమరవీరులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకులు పుల్లెంల శ్రీకర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం, రైతు కూలీలు – పేద ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగించిన చారిత్రాత్మక పోరాటాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 17 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నాటి పోరాటంలో రైతులు, కూలీలు, పేద ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు – వారు సాగించిన ఉద్యమం గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్రీకర్ అన్నారు. ప్రజల హక్కులు, భూమి కోసం జరిగిన పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. భూమి, వెట్టిచాకిరీ నిర్మూలన – సామాజిక న్యాయం కోసం ప్రజలు సాగించిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆ పోరాటంలో ప్రజలు ప్రదర్శించిన ఐక్యత – ధైర్యం, త్యాగాలను గుర్తు చేసుకోవడం ద్వారా ప్రజా సమస్యలపై పోరాడే స్ఫూర్తి పెరుగుతుందని శ్రీకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ ఐక్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్ర కన్నయ్య, పతాని శ్రీను, తంగెళ్ల నాగమణి, ఊరుగొండ శ్రీను, నారాయణరెడ్డి, ఐతగాని విష్ణు, ఎలిజాల రమేష్, గవ్వ రవి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.






