ఇక దగ్గు మందు సీసాపై.. ఎర్ర హెచ్చరిక!
చిన్నారులకు దగ్గు మందుల వినియోగాన్ని నియంత్రించే దిశగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ కీలక మార్పులను పరిశీలిస్తోంది. నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు ఉపయోగించకూడదనే హెచ్చరికను సీసా లేబుల్‌పై ఎరుపు రంగులో తప్పనిసరిగా ముద్రించేలా నిబంధనల్లో మార్పు చేయాలని ప్రతిపాదించింది.
ఔషధ సీసాపై హెచ్చరికతో పాటు పాఠశాల వయసు పిల్లల చిత్రాన్ని కూడా ముద్రించే అంశాన్ని ప్రతిపాదనలో చేర్చారు. మందు పెద్ద పిల్లల కోసం ఉద్దేశించినదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడంతో పాటు, శిశువులు – చిన్నారులకు దీని వినియోగాన్ని నిరుత్సాహపరచడం దీని ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ముందుంచి చర్చించనున్నారు. ఇందుకోసం డ్రగ్స్ రూల్స్-1945లోని రూల్ 96ను సవరించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
చిన్నారులకు దగ్గు – జలుబు మందులను విచక్షణతో మాత్రమే సూచించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) 2025 అక్టోబర్‌లో వైద్యులకు సూచించింది. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు ఇలాంటి మందులను ప్రిస్క్రైబ్ చేయడం లేదా ఇవ్వడం చేయకూడదని అప్పట్లో స్పష్టం చేసింది.
అయితే ఆ మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత కూడా రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందులు సూచిస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. ఈ అంశాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు చెందిన అంతర్గత సాంకేతిక కమిటీ 2026 ఏప్రిల్‌లో పరిశీలించింది.
ఈ అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో చర్చించాలని, పిల్లల విషయంలో దగ్గు మందులపై ఏదైనా పరిశోధన లేదా ప్రతిపాదనలు ఉన్నాయా అన్నది తెలుసుకోవాలని కమిటీ సూచించింది. అలాగే లేబులింగ్‌లో మార్పుల నియంత్రణ – మార్కెటింగ్ సాధ్యాసాధ్యాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని సిఫారసు చేసింది.
అయితే దగ్గు మందుల లేబులింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక పని చేపట్టడం లేదని ఐసీఎంఆర్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు భారత్‌లో దగ్గు మందులు అత్యంత సాధారణంగా ప్రిస్క్రైబ్ చేసే – వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనుగోలు చేసే మందుల్లో ఒకటిగా ఉన్నాయని, చాలా చిన్న పిల్లల్లో వాటి వినియోగం చాలాకాలంగా ఆందోళన కలిగిస్తున్న అంశమని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉంది. డీసీసీ చర్చలు – తదుపరి నియంత్రణ ప్రక్రియ అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిబంధనల్లో మార్పు అమల్లోకి వస్తే దగ్గు మందుల సీసాలపై వయస్సుకు సంబంధించిన హెచ్చరికలు మరింత స్పష్టంగా కనిపించనున్నాయి.






