ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
కుత్బుల్లాపూర్, నవంబర్ 27 (నవజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించేందుకు దుండిగల్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్ దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి, బౌరంపేట, దుండిగల్ వార్డు కార్యాలయాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా బీమా సొమ్ము ద్వారా అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆధార్ కార్డులోని వయస్సు ఆధారంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిని అర్హులుగా పరిగణించనున్నారు. కావున అర్హులైన ప్రజలు సమీప వార్డు కార్యాలయాలను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్ సూచించారు.






