Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

తోటి కార్మికుడి కుటుంబానికి అండగా రూ.73 వేల ఆర్థిక సాయం

November 23, 2026 · 6 days క్రితం
◉ 4 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి ప్రతినిధి, నవంబర్ 23 (నవ జ్యోతి ప్రతినిధి): ఆపదలో ఉన్న తోటి కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి లారీ ఓనర్స్ అసోసియేషన్, లారీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని పిలాయిపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గ్యార బాలస్వామి ఇటీవల అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన తోటి కార్మికులు బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు లారీ ఓనర్స్ అసోసియేషన్, లారీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.73 వేల నగదును సమకూర్చి బాలస్వామి కుటుంబానికి అందజేశారు. కష్టసమయంలో కుటుంబాన్ని ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి చేసిన ఈ సహాయం పలువురి ప్రశంసలు అందుకుంది.
కార్మికుల మధ్య ఉండాల్సిన ఐకమత్యానికి, తోటి మనిషి కష్టాన్ని తమ కష్టంగా భావించే గొప్ప మనసుకు ఈ సహాయం నిదర్శనంగా నిలిచింది. ఆర్థిక సాయం కంటే ఆపద సమయంలో మేమున్నామంటూ భరోసా ఇవ్వడమే గొప్ప విషయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల బాలరాజు, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కుతాటి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు లింగాల సురేష్, సుక్క జంగయ్య, ఎం.డి. చాన్, నరసింహ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram