వాటర్ ప్లాంట్ ముసుగులో అక్రమ మద్యం విక్రయాలా?
కుషాయిగూడ, నవంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): కుషాయిగూడలో వాటర్ ప్లాంట్ ముసుగులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బస్తీ దవాఖానకు వెళ్లే మార్గంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ మద్యం సేవిస్తున్న కొందరు మహిళలు, విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నివాస గృహాల ఎదుట అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాలనీలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని తెలిపారు. గతంలో పలుమార్లు సంబంధిత కుటుంబాన్ని హెచ్చరించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు కలిసి సంబంధిత ప్రాంతానికి వెళ్లి మద్యం విక్రయాలు నిలిపివేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాలు కొనసాగితే చట్టపరమైన చర్యల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. కాలనీలో శాంతిభద్రతలు కాపాడేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట పడేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో చక్రపాణి గౌడ్, కొడకండ్ల యాదయ్య, వాసుదేవ ముదిరాజ్, చల్లా వెంకటేష్, నలచెరువుల జనార్దన్, పిట్ల రాజు ముదిరాజ్, దయానంద్, వికాస్ రెడ్డి, బన్నాపురం నాగరాజు, అనిల్ యాదవ్, క్యాత దినేష్, కార్తీక్, సత్తి, చల్లా వీరేందర్, సుధాకర్, వేణు, తిలక్, సోనూ సింగ్, మల్లేష్, నాని తదితరులు పాల్గొన్నారు.






