జైపూర్, అక్టోబర్ 3 (నవజ్యోతి ప్రతినిధి):
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని యాపిల్ కస్టమర్ సపోర్ట్ ప్రతినిధులుగా నటిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ కాల్ సెంటర్‌ను రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు ఛేదించారు. సిర్సీ రోడ్డులోని మంగ్లామ్ గ్రాండ్ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్‌లో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు.
ఇలా మోసం చేస్తున్నట్లు ఆరోపణలు
యాపిల్ ఉత్పత్తుల కోసం ముందస్తు చార్జీలు విధించినట్లు అమెరికా పౌరులకు నకిలీ SMSలు పంపేవారు. వారు ఆ సందేశాల్లోని నంబర్లకు తిరిగి కాల్ చేయగానే యాపిల్ సపోర్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకుని డబ్బులు చెల్లించాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఠా సభ్యులు అమెరికా పౌరులకు యాపిల్ ఉత్పత్తులకు సంబంధించిన 399 డాలర్లు, 499 డాలర్లు, 699 డాలర్లు చెల్లించాల్సి ఉందంటూ నకిలీ సందేశాలు పంపేవారు. ఆ మొత్తాలను సాంకేతిక సహాయం, ఛార్జీలను రద్దు చేయడం లేదా ప్రాసెస్ చేయడం పేరుతో వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిర్దిష్ట సమాచారంతో బిందాయక పోలీసులతో పాటు జైపూర్ వెస్ట్ జిల్లా స్పెషల్ టీమ్, రాజస్థాన్ సైబర్ క్రైమ్ కంట్రోల్ సెంటర్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాల్ సెంటర్‌పై దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
పోలీసులు 13 ల్యాప్‌టాప్‌లు, 24 మొబైల్ ఫోన్లుతో పాటు పలు సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించి మోసాలకు ఉపయోగించిన విధానం, బాధితుల వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ ముఠా ఎంతమంది అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుంది? ఎంత మొత్తంలో మోసం జరిగింది? అమెరికాలోని బాధితుల ఫోన్ నంబర్లను ఎలా సేకరించారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ సెంటర్‌కు ఉన్న అంతర్జాతీయ సంబంధాలు, డబ్బు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లలోని డేటాను విశ్లేషించిన తర్వాత మోసాల పూర్తి స్థాయి, ఇతర నిందితుల పాత్ర, విదేశీ కనెక్షన్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల పేర్లను ఉపయోగించి నకిలీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అపరిచిత నంబర్ల నుంచి వచ్చే చెల్లింపు అభ్యర్థనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.