Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

కొరియర్ మాటున బంగారం స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ రూ.10.36 కోట్ల విలువైన 6.61 కిలోల విదేశీ బంగారం స్వాధీనం !

మాస్టర్‌మైండ్‌ సహా 11 మంది అరెస్ట్‌ - 9 నెలల్లో రూ.475 కోట్ల బంగారం తరలింపు
SAI MANIKANTA
September 29, 2026 · 11 hours క్రితం
◉ 8 Views ↗ 2 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి): దేశవ్యాప్తంగా కొరియర్‌ నెట్‌వర్క్‌ను అడ్డంగా పెట్టుకుని సాగుతున్న బంగారం స్మగ్లింగ్‌ వ్యవస్థను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలాలున్న అక్రమంగా తరలిస్తున్న 6.61 కిలోల బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.10.36 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన వ్యక్తితో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు.

పశ్చిమ బెంగాల్‌, అసోం మీదుగా విదేశీ బంగారాన్ని భారత్‌లోకి తీసుకొచ్చి.. అనంతరం కొరియర్‌ పార్సిళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఆర్‌ఐకి సమాచారం అందింది. దీంతో సెప్టెంబర్‌ 23-24 తేదీల్లో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, గువాహటిలో ఏకకాలంలో తనిఖీలు, అడ్డగింతలు చేపట్టారు.

గువాహటి, కోల్‌కతా నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌కు పంపుతున్న కూరియర్‌ పార్సిళ్లను అధికారులు అడ్డుకున్నారు. వాటిని స్వీకరించేందుకు వచ్చిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలో పార్సిళ్లు పంపిన వ్యక్తుల ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి మరో ముగ్గురిని పట్టుకున్నారు. అనంతరం ముంబైలో స్మగ్లింగ్‌ బంగారం పంపిణీ, డెలివరీని సమన్వయం చేస్తున్నట్లు గుర్తించిన మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

దర్యాప్తులో స్మగ్లింగ్‌ చేసిన బంగారాన్ని చిన్నచిన్న కొరియర్ పార్సిళ్లుగా విడగొట్టి గువాహటి, కోల్‌కతా నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని వేర్వేరు వ్యక్తులకు పంపుతున్నట్లు వెల్లడైంది. బంగారం లావాదేవీలకు ఎలాంటి చట్టబద్ధమైన కార్యకలాపాలు లేని వ్యక్తులు, సంస్థలను కాగితాలపై ఉపయోగిస్తూ నెట్‌వర్క్‌ను నడిపినట్లు డీఆర్‌ఐ గుర్తించింది.

9 నెలల్లో రూ.475 కోట్ల బంగారం
డీఆర్‌ఐ ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ప్రస్తుత క్యాలెండర్‌ ఏడాదిలో కేవలం తొమ్మిది నెలల్లోనే ఇదే కూరియర్‌ నెట్‌వర్క్‌ ద్వారా సుమారు 318 కిలోల స్మగ్లింగ్‌ బంగారం తరలించారు. దీని విలువ సుమారు రూ.475 కోట్లుగా అధికారులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న 6.61 కిలోల విదేశీ మూలాలున్న బంగారం బార్ల రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్‌ చట్టం-1962లోని సంబంధిత నిబంధనల కింద బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత బంగారం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు డీఆర్‌ఐ కొనసాగిస్తున్న చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మగ్లింగ్‌ బంగారం సరఫరా గొలుసులో కూరియర్‌ వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఉపయోగిస్తున్న నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ – డీఆర్‌ఐ / పీఐబీ సమాచారం ఆధారంగా

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram