Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ఆమ్రాబాద్‌లో రాత్రివేళ వాహనాలకు బ్రేక్

వన్యప్రాణుల రక్షణే లక్ష్యం.. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు రాకపోకలపై ఆంక్షలు
LAXMAN
September 27, 2026 · 3 days క్రితం
◉ 3 Views ↗ 0 Shares

నాగర్‌కర్నూల్, నవజ్యోతి దినపత్రిక:వన్యప్రాణుల సంరక్షణ, రోడ్డు ప్రమాదాల నుంచి వాటికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో రాత్రివేళ వాహనాల రాకపోకలపై అటవీ శాఖ ఆంక్షలు విధించనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సాధారణ వాహనాలను రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, ఇతర అత్యవసర విధుల్లో ఉండే వాహనాలకు మాత్రమే మినహాయింపు కల్పించనున్నారు.

టైగర్ రిజర్వ్‌లలోని కోర్, క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ ప్రాంతాల మీదుగా వెళ్లే రహదారులపై రాత్రివేళ వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు సహా అనేక వన్యప్రాణులు రహదారులపై సంచరిస్తుంటాయని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలతో వాటి సహజ జీవనానికి ఆటంకం కలగడంతో పాటు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుందని వివరించారు.

దేశంలోని ప్రధాన పులుల ఆవాసాల్లో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు ప్రత్యేక స్థానం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాత్రివేళ వాహనాల నియంత్రణతో జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను ముందుగానే ప్రణాళిక చేసుకుని నిర్ణీత వేళల్లో రిజర్వ్ ప్రాంతాన్ని దాటాలని సూచించారు. నిబంధనల అమలుకు వాహనదారులు సహకరించాలని, వన్యప్రాణులు, ప్రకృతి సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అటవీ శాఖ కోరింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram