Wednesday, September 23, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
వ్యాపారం

యూపీఐకి బ్రేక్‌.. నగదు వైపు వ్యాపారులు!

ఎండీఆర్‌ చార్జీలపై వర్తకుల ఆందోళన...రూ.2 వేలకుపైగా లావాదేవీలకు క్యాష్‌నే కోరుతున్న వ్యాపారులు
SAI MANIKANTA
September 23, 2026 · 2 hours క్రితం
8 Views 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి):

‘డిజిటల్‌ ఇండియా’లో భాగంగా ప్రతి గల్లీలోనూ విస్తరించిన యూపీఐ చెల్లింపులకు వ్యాపార వర్గాల నుంచి ఎదురుదెబ్బ తగులుతోంది. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) చార్జీల అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పలువురు వ్యాపారులు ముందుగానే నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, మార్కెట్లు, హోల్‌సేల్‌ వ్యాపార సంస్థల్లో ‘క్యాష్‌ పేమెంట్‌’కు ప్రాధాన్యం పెరుగుతోంది.

హైదరాబాద్‌లోని బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, జనరల్‌బజార్‌, అబిడ్స్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కోఠి వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రూ.2 వేలకుపైబడిన చెల్లింపులను నగదు రూపంలో స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ వ్యాపారం, పెరిగిన పోటీ కారణంగా మార్జిన్లు తగ్గాయని, అదనంగా ఎండీఆర్‌ చార్జీలు పడితే వ్యాపారంపై మరింత భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూపీఐ ద్వారా చెల్లించే మొత్తంపై అదనపు చార్జీ భారం తమపై పడకుండా ఉండేందుకు నగదు చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని కొందరు వర్తకులు చెబుతున్నారు. కస్టమర్‌ ఆ చార్జీని భరించేందుకు సిద్ధంగా ఉంటే మాత్రం ఆన్‌లైన్‌ చెల్లింపులను స్వీకరిస్తామని పేర్కొంటున్నారు.

ఒకరి ఖాతా నుంచి మరో ఖాతాకు లావాదేవీలను మళ్లించడం ద్వారా చార్జీలను తప్పించుకునే మార్గాలు ఉన్నప్పటికీ, అనేక ఖాతాలను నిర్వహించడం తమకు అదనపు భారం అవుతుందని, అందుకే నగదు లావాదేవీలే సులభంగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.

దీంతో QR కోడ్‌లతో డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడిన చిన్న వ్యాపారాల్లోనూ మరోసారి నగదు లావాదేవీలపై చర్చ మొదలైంది. అయితే ఎండీఆర్‌ అమలు, దాని పరిధి, వ్యాపారులపై పడే వాస్తవ ఆర్థిక ప్రభావం వంటి అంశాలపై స్పష్టత ఆధారంగా పరిస్థితి ఎలా మారుతుందన్నది కీలకంగా మారింది.