Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

లగ్జరీ హోటల్‌లో ‘రోచీ’ షాక్‌.. విదేశీ అతిథుల ముందే పరువు పోయిందంటున్న కార్డియాలజిస్ట్‌ !

‘రోచీ’
SAI MANIKANTA
September 21, 2026 · 9 hours క్రితం
6 Views 2 Shares

డిన్నర్‌ టేబుల్‌పై బొద్దింక ప్రత్యక్షం.. భోజనం మధ్యలోనే వెళ్లిపోయిన డా. అశోక్‌ సేథ్‌

“మాతో పాటు రోచీ కూడా డిన్నర్‌కు వచ్చింది.. ఆకలి చచ్చిపోయింది” అంటూ ఎక్స్‌లో పోస్ట్‌
ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ తుకారాం ముండేను ట్యాగ్‌ చేసిన కార్డియాలజిస్ట్‌

ముంబై, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

విలాసవంతమైన హోటల్‌.. విదేశీ అతిథులతో కలిసి డిన్నర్‌.. అంతలోనే టేబుల్‌పై బొద్దింక ప్రత్యక్షం. దీంతో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా. అశోక్‌ సేథ్‌ అసహనం వ్యక్తం చేశారు. ముంబై సహార్‌లోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లోని రొమానో రెస్టారెంట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఛైర్మన్‌, హృద్రోగ నిపుణుడైన డా. అశోక్‌ సేథ్‌ ఆదివారం డిన్నర్‌ కోసం హోటల్‌కు వెళ్లినట్లు తెలిపారు. విదేశీ అతిథులతో కలిసి భోజనం చేస్తుండగా టేబుల్‌పై చిన్న బొద్దింక కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియోతో సహా ఎక్స్‌లో పోస్టు చేశారు.

బొద్దింకకు సరదాగా ‘రోచీ’ అని పేరు పెట్టిన డా. సేథ్‌.. తమతో కలిసి డిన్నర్‌ చేయడానికి అది కూడా వచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి వెళ్లేందుకు అది నిరాకరించిందని, బహుశా దానికి పాస్తా కాకుండా పిజ్జా కావాలేమోనంటూ సరదాగా రాశారు.

అయితే ఈ ఘటనతో తమకు ఆకలి పూర్తిగా చచ్చిపోయిందని, భోజనం పూర్తి చేయకుండానే రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చేశామని డా. సేథ్‌ తెలిపారు. విదేశీ అతిథుల సమక్షంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆహార పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన పేర్కొన్నారు.

హోటల్‌ రెస్టారెంట్‌లో ఆహార భద్రత – పరిశుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తిన డా. సేథ్‌.. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు పాటించని హోటళ్లు – రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు, చర్యలు చేపడుతున్న సమయంలో ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ ఘటనపై జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. డా. సేథ్‌ సోషల్‌ మీడియా పోస్టుతో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

డిన్నర్‌ టేబుల్‌పై ‘రోచీ’.. విదేశీ అతిథుల ముందే బొద్దింక ప్రత్యక్షం కావడంపై కార్డియాలజిస్ట్‌ అసహనం.