ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. హాకీలో 19-0 విజయం!
ఉజ్బెకిస్థాన్‌పై భారత మహిళల భారీ గెలుపు.. దీపిక 8 గోల్స్
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం మహిళల హాకీ జట్టు ఉజ్బెకిస్థాన్‌పై ఏకంగా 19-0తో ఘన విజయం సాధించింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకం సాధించింది.
హాకీ మ్యాచ్‌లో దీపిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె ఏకంగా ఎనిమిది గోల్స్ చేసింది. ఇందులో ఐదు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. ఇషిక మూడు గోల్స్ సాధించింది. నేహా – లల్తంత్లువాంగి రెండేసి గోల్స్ చేయగా.. లల్రెమ్సియామి, బాల్జీత్, సాక్షి రాణా, నవనీత్ కౌర్ ఒక్కో గోల్ చేశారు.
మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి 4-0తో ముందంజలో నిలిచిన భారత్.. రెండో క్వార్టర్లో మరో నాలుగు గోల్స్ చేసి హాఫ్‌టైమ్‌కు 8-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్లోనూ దూకుడు కొనసాగించి మరో ఏడు గోల్స్ చేసింది. చివరి క్వార్టర్లో మరో నాలుగు గోల్స్‌తో మ్యాచ్‌ను 19-0తో ముగించింది.
మహిళల టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో ఇండోనేషియాపై 3-0తో గెలిచింది. శ్రీజ ఆకుల, దియా చితలే, యశస్విని ఘోర్పడే తమ మ్యాచ్‌ల్లో వరుస గేమ్‌ల విజయాలతో భారత్‌కు సౌకర్యవంతమైన విజయాన్ని అందించారు.
షూటింగ్లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్శ వినోద్‌తో కూడిన భారత జట్టు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. చైనా స్వర్ణం దక్కించుకోగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది.
ఎలవెనిల్ వలరివన్ 633.5 పాయింట్లతో వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది. సోనమ్ మాస్కర్ కూడా వ్యక్తిగత ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం షూటింగ్ ద్వారానే లభించింది.
హాకీలో భారీ విజయం, షూటింగ్లో రజత పతకం, టేబుల్ టెన్నిస్‌లో గెలుపుతో నాగోయా ఆసియా క్రీడల్లో భారత బృందం పతకాల వేటను ప్రారంభించింది.






