Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ఆరోగ్యం

నెస్లే శిశు ఆహార ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్య !

‘5 హెచ్‌ఎంఓలు’ - ‘వే ప్రొటీన్‌’ క్లెయిమ్‌లపై కేసులు...‘ఈజీ టు డైజెస్ట్‌’ వే ప్రొటీన్‌ క్లెయిమ్‌పైనా అభ్యంతరం- మరో ఉత్పత్తిలో బయోటిన్‌ ప్రమాణాలు!
SAI MANIKANTA
September 18, 2026 · 3 hours క్రితం
9 Views 1 Shares

‘5 హెచ్‌ఎంఓలు’ – న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

శిశు ఆహార ఉత్పత్తులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై నెస్లే ఇండియాపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మూడు వేర్వేరు అడ్జుడికేషన్‌ కేసులు ప్రారంభించింది. నెస్లే ఇండియాకు చెందిన NAN Excella Pro Stage 1Lactogen Pro 1 ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార క్లెయిమ్‌లు – మరో ఫాలో-అప్‌ ఫార్ములా ఉత్పత్తి నాణ్యతపై నియంత్రణ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకారం, ఈ ఉత్పత్తులను – వాటికి సంబంధించిన ప్రచార సమాచారాన్ని ఈ-కామర్స్‌ వేదికలపై పరిశీలించిన సందర్భంగా కొన్ని క్లెయిమ్‌లు గుర్తించారు. NAN Excella Pro Stage 1 ఉత్పత్తిపై ‘5 HMOs’ – ‘Whey Protein’కు సంబంధించిన క్లెయిమ్‌లను, Lactogen Pro 1పై వే ప్రొటీన్‌ ‘ఈజీ టు డైజెస్ట్‌’ అని పేర్కొన్న క్లెయిమ్‌ను పరిశీలించారు.

ఈ క్లెయిమ్‌లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నెస్లే ఇండియా నుంచి వివరణ కోరింది. అనంతరం ఉత్పత్తులు Food Safety and Standards (Foods for Infant Nutrition) Regulations, 2020లోని రెగ్యులేషన్‌ 4(2)కు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.

శిశు ఆహార ఉత్పత్తుల విక్రయాలను పెంచే ఉద్దేశంతో చేసే ప్రచార క్లెయిమ్‌లు – ప్రచార సామగ్రిపై ఈ నిబంధనలు ఆంక్షలు విధిస్తాయి. అలాగే Infant Milk Substitutes, Feeding Bottles and Infant Foods (Regulation of Production, Supply and Distribution) Act, 1992లోని సెక్షన్‌ 3ను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రస్తావించింది. శిశు ఆహార ఉత్పత్తుల ప్రకటనలు – ప్రచారంపై ఈ చట్టం నిబంధనలు వర్తిస్తాయి.

ఇదే సమయంలో నెస్లే ఇండియాకు చెందిన మరో ఫాలో-అప్‌ ఫార్ములా ఉత్పత్తికి సంబంధించిన నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా, అందులో బయోటిన్‌ పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. దీంతో ఆ నమూనాను మరోసారి పరీక్షించేందుకు రెఫరల్‌ ల్యాబొరేటరీకి పంపించారు.

రెఫరల్‌ ల్యాబొరేటరీలో నిర్వహించిన రెండో పరీక్షలోనూ ఆ నమూనా 2020 నాటి ఫుడ్స్‌ ఫర్‌ ఇన్ఫెంట్‌ న్యూట్రిషన్‌ నిబంధనల్లో నిర్దేశించిన బయోటిన్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.

ఈ మూడు ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై నెస్లే ఇండియాపై మూడు వేర్వేరు అడ్జుడికేషన్‌ కేసులు దాఖలు చేసినట్లు ఆహార నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఇందులో ప్రచార క్లెయిమ్‌లకు సంబంధించిన అంశాలతో పాటు ఉత్పత్తి నమూనాలో బయోటిన్‌ ప్రమాణాల ఉల్లంఘన అంశం కూడా ఉంది.

అయితే ఈ కేసులపై తుది జరిమానా విధించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులో పేర్కొనలేదు. ప్రస్తుతం ఇవి నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలుగా పేర్కొన్న ఆరోపణలు – ప్రయోగశాల పరీక్షలో నమోదైన నాన్‌-కన్ఫార్మిటీకి సంబంధించిన అడ్జుడికేషన్‌ ప్రక్రియలో ఉన్నాయి.

శిశు ఆహార ఉత్పత్తుల విషయంలో పోషక విలువలు – ఉత్పత్తి నాణ్యత – ప్రచార క్లెయిమ్‌లకు సంబంధించిన నిబంధనలను పాటించడం కీలకంగా మారింది. ఈ వ్యవహారంపై నెస్లే ఇండియా నుంచి తక్షణ స్పందన వెలువడలేదని సమాచారం.