2038 ఆసియా క్రీడలపై భారత్ కన్ను !
2038 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కుల కోసం భారత్ సమర్పించిన బిడ్‌పై నిర్ణయం 2028కు ముందు వెలువడదని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) వెల్లడించింది. భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా 2038 ఆసియా క్రీడల నిర్వహణపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఓసీఏ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ అల్-ముసల్లమ్ తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ 2038 ఆసియా క్రీడల ఆతిథ్యం కోసం అధికారికంగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. అంతర్జాతీయ స్థాయి బహుళ క్రీడా పోటీలకు భారత్‌ను ప్రధాన వేదికగా తీర్చిదిద్దే వ్యూహంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఫిలిప్పీన్స్‌తో పాటు మరో నాలుగు దేశాల నుంచి కూడా ఆసక్తి వ్యక్తమైనట్లు ఓసీఏ వెల్లడించింది. 2038 క్రీడలకు ఇంకా 12 సంవత్సరాల సమయం ఉన్నందున ఆతిథ్య దేశ ఎంపికకు పలు దశల్లో పరిశీలన జరగనుంది. వచ్చే ఏడాది బిడ్డింగ్ దేశాల్లో మూల్యాంకన కమిటీ పర్యటించి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది.
ప్రాథమిక నివేదిక ఆధారంగా బిడ్డింగ్ దేశాల్లో కొన్ని దేశాలను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం మరోసారి ఆయా దేశాల్లో పర్యటించి తుది నివేదికను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు 2038 ఆసియా క్రీడల ఆతిథ్య దేశంపై తుది నిర్ణయం తీసుకోబోమని ఓసీఏ స్పష్టం చేసింది.
దక్షిణ కొరియా 2038 ఆసియా క్రీడల నిర్వహణపై 2021లోనే ఆసక్తి వ్యక్తం చేసింది. గ్వాంగ్జు – డేగు నగరాలను వేదికలుగా ప్రతిపాదించింది. మంగోలియా కూడా ఆతిథ్య హక్కుల కోసం ఆసక్తి చూపినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఆ దేశం అధికారికంగా ఈఓఐ సమర్పించిందా లేదా అన్నది స్పష్టంగా లేదు.
భారత్ చివరిసారిగా 1982లో న్యూఢిల్లీలో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. అంతకుముందు 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడలకు కూడా న్యూఢిల్లీ వేదికైంది. ప్రస్తుతం భారత్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం కూడా ప్రయత్నిస్తోంది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
2030 ఆసియా క్రీడలు ఖతార్ రాజధాని దోహాలో, 2034 క్రీడలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నాయి. 2030 – 2034 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కులను ఓసీఏ 2020లోనే కేటాయించింది.
2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు నాగోయాలో జరగనున్నాయి. ఆసియా ఖండంలోని 45 దేశాలు పాల్గొనే ఈ క్రీడల్లో 11 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. 2023లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో 40 క్రీడాంశాల్లో 11 వేలకు పైగా క్రీడాకారులు పోటీపడ్డారు.






