Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ఫిరాయింపులను ఇకనైనా ఆపాలి;హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి

September 19, 2026 · 3 days క్రితం
3 Views 0 Shares

ఫిరాయింపులను ఇకనైనా ఆపాలి

హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌లకు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి): ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెంపపెట్టు వంటిదన్నారు. ప్రజల తీర్పును పక్కనపెట్టి రాజకీయ అవసరాల కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వంటి నేతలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడే రాహుల్‌గాంధీ.. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భూముల ధరలను కృత్రిమంగా పెంచుతూ హైప్‌ చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం మూడేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు పనుల వేగవంతానికి నోడల్‌ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 1,500 ఎకరాల్లో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రం, బేస్‌తో పాటు సివిల్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుందని చెప్పారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు డీపీఆర్‌ సిద్ధమవుతోందని, ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు.