Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

చేనేత ఇక్కత్ కళకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంలో కళాకారుల కృషి అమూల్యం

November 23, 2026 · 6 days క్రితం
◉ 9 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 23(నవజ్యోతి ప్రతినిధి): భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తన సతీమణి శ్రావణితో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ పురోహితులు దోర్నాల పాండు దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు మాట్లాడుతూ.. భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ విలువలను తరతరాలకు అందించే పవిత్ర కేంద్రాలని పేర్కొన్నారు. దైవచింతన మనిషికి మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాన్ని అందిస్తుందని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలోనూ మన మూలాలను, ఆధ్యాత్మిక సంప్రదాయాలను మరువకుండా వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
పోచంపల్లి ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచ పటంలో భూదాన్ పోచంపల్లికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చింది ఇక్కడి చేనేత కళాకారుల అద్భుతమైన కళానైపుణ్యమని కలెక్టర్ కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు దేశ విదేశాల్లో ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయని, ఈ గుర్తింపు వెనుక తరతరాలుగా చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కళాకారుల శ్రమ, సృజనాత్మకత, అంకితభావం ఉన్నాయని అన్నారు. చేనేత అనేది కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, అది మన ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అభివర్ణించారు.
అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఆయన సతీమణి శ్రావణి దంపతులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సీత సత్యనారాయణ, పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు శ్రేష్ఠ, మంగళపల్లి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram