జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం
సంగారెడ్డి, సెప్టెంబర్ 25 (నవజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, యువత తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నిమజ్జనోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, నృత్య బృందాలు, వాయిద్య కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ కళాకారుల ప్రత్యేక నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో నిమజ్జన మార్గాలు మార్మోగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వినాయక విగ్రహాల శోభాయాత్రలతో పట్టణ ప్రధాన వీధులు సందడిగా మారాయి. భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనోత్సవంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






