రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే ధ్యేయం
జగిత్యాల, అక్టోబర్ 31 (నవజ్యోతి ప్రతినిధి): రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభాకు సంబంధించిన లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితమైన జనాభా వివరాలను సేకరించేందుకు ప్రతి కుటుంబం సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపుల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అవసరమైన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మున్నూరు కాపు కుటుంబాల వివరాలను డిజిటల్ వెబ్సైట్ ద్వారా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియతో కులబాంధవుల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు. సంఘాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టపరిచేందుకు సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపడతామని తెలిపారు. రాజకీయ అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ సామాజిక ప్రయోజనాల విషయంలో అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సంఘం చేపట్టే కార్యక్రమాల్లో యువత, మహిళలు చురుగ్గా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం సభ్యత్వ నమోదు పోస్టర్‌తోపాటు సంఘం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, పట్టణ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.






