విద్యార్థుల కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’
హైదరాబాద్, అక్టోబర్ 30 (నవజ్యోతి ప్రతినిధి): విద్యార్థుల సృజనాత్మకత, కళా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘సాధన 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. లలిత, ప్రదర్శన కళల విభాగం డాన్స్ స్టూడియోలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, నాటకం, దృశ్య కళల్లో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో బృందాలుగా ఏర్పడి అభ్యసించిన నైపుణ్యాలను ప్రదర్శించారు. సంగీత కార్యక్రమాలకు మృదంగంపై చంద్రకాంత్, వయోలిన్‌పై వాసుశాస్త్రి సహకారం అందించారు. ప్రత్యక్ష వాయిద్య సహకారంతో ప్రదర్శనలు ఇవ్వడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్యంతర మూల్యాంకనంలో భాగంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. కళాత్మక వ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలు, వేదికపై ప్రదర్శన సామర్థ్యాలను మెరుగుపరచుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. భవిష్యత్తు కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు వివరించారు. వివిధ కళారూపాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తమ అభ్యసన ప్రగతిని ప్రేక్షకుల ముందు తెలియజేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.






