Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్‌లో సీజ్‌.. కొంపల్లిలో నిర్మాణం పూర్తి!

సీజ్‌ భవనం.. పార్టీ కార్యాలయం.. మధ్యలో ఏమైంది? సీజ్‌ చేసిన తర్వాత కూడా పనులు సాగాయన్న ఆరోపణలు.. ఇప్పుడు అదే భవనంలో కాంగ్రెస్‌ డివిజన్‌ కార్యాలయం!
SAI MANIKANTA
September 27, 2026 · 2 days క్రితం
◉ 269 Views ↗ 2 Shares
కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 27 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):

ఒకప్పుడు అక్రమ నిర్మాణమంటూ అధికారులు సీజ్‌ చేసిన భవనం.. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాణంగా మారి రాజకీయ పార్టీ కార్యాలయంగా వినియోగంలోకి రావడం కుత్బుల్లాపూర్‌ పరిధిలోని కృషి కాలనీలో చర్చనీయాంశంగా మారింది. సాయిబాబా నగర్‌ 292వ డివిజన్‌ పరిధిలోని కృషి కాలనీ రోడ్డు నంబర్‌ 10లో రహదారి హద్దులను ఆక్రమిస్తూ నిర్మాణం చేపడుతున్నారంటూ గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిర్మాణాన్ని సీజ్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

అక్కడితో కథ ముగిసిందనుకుంటే.. అసలు ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి!

సీజ్‌ చేసిన అనంతరం కూడా అదే భవనంలో నిర్మాణ పనులు కొనసాగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు-రాత్రి తేడా లేకుండా పనులు సాగి భవనం పూర్తయిందని చెబుతున్నారు. ప్రస్తుతం అదే భవనంలో సాయిబాబా నగర్‌ 292వ డివిజన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం ఏర్పాటు కావడంతో గతంలో జరిగిన సీజ్‌ చర్యపై మరోసారి చర్చ మొదలైంది.

సర్కిల్‌ మారితే.. సీజ్‌ కూడా మారిపోతుందా?

గతంలో ఈ ప్రాంతం సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఉండగా.. అనంతరం సాయిబాబా నగర్‌ 292వ డివిజన్‌లోకి వచ్చి కొంపల్లి సర్కిల్‌ పరిధిలో చేరింది. అయితే పరిపాలనా పరిధి మారినంత మాత్రాన గతంలో నమోదైన నిర్మాణ ఉల్లంఘనలపై తీసుకున్న చర్యల పరిస్థితి మారుతుందా? అన్నదే స్థానికుల ప్రధాన ప్రశ్నగా మారింది.

గతంలో జారీ చేసిన సీజ్‌ ఉత్తర్వులను అధికారికంగా ఎత్తివేశారా? కొత్తగా నిర్మాణ అనుమతులు మంజూరయ్యాయా? రహదారి హద్దులు, సెట్‌బ్యాక్‌ నిబంధనలు పరిశీలించారా? సీజ్‌ అనంతరం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారా? నిర్వహించి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సీజ్‌ చేసిన భవనానికి ‘గ్రీన్‌ కార్పెట్‌’ ఎవరు వేశారు?

గతంలో అధికారులు సీజ్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్న నిర్మాణం.. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయి వినియోగంలోకి రావడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రెడ్‌ సిగ్నల్‌ వేసిన నిర్మాణానికి ఇప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నిర్మాణంపై గతంలో వివిధ సందర్భాల్లో వార్తా కథనాలు కూడా వెలువడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం భవనం పూర్తికావడంతో అధికారులు అప్పట్లో తీసుకున్న చర్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్‌ చేసిన తర్వాత నిర్మాణ పనులు జరిగి ఉంటే వాటిని అధికారులు గుర్తించారా? గుర్తించి ఉంటే ఏ చర్యలు తీసుకున్నారు? అన్నది తేలాల్సి ఉంది.

పార్టీ కార్యాలయం ఏర్పాటుతో మరింత ఆసక్తి

ఇప్పటికే నిర్మాణం పూర్తికావడంతో పాటు అందులో రాజకీయ పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడం ఈ వ్యవహారానికి మరో కోణాన్ని తీసుకొచ్చింది. సీజ్‌ చేసిన భవనం ఎలా పూర్తయింది? ఎవరి అనుమతులతో నిర్మాణం పూర్తయింది? ప్రస్తుతం ఏ ప్రాతిపదికన ఆ భవనాన్ని కార్యాలయంగా వినియోగిస్తున్నారు? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

అయితే భవనం ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఉందా? గతంలో జారీ చేసిన సీజ్‌ ఉత్తర్వులకు సంబంధించి ఏదైనా తదుపరి అనుమతి లేదా ఉత్తర్వు జారీ అయ్యిందా? వంటి అంశాలను అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టం చేయాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందిస్తే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రికార్డులు బయటపెడితే.. అసలు విషయం తేలేనా?

ఇప్పటికైనా కొంపల్లి డిప్యూటీ కమిషనర్‌ స్పందించి గతంలో జరిగిన సీజ్‌ చర్యకు సంబంధించిన రికార్డులు, ప్రస్తుతం ఉన్న నిర్మాణ అనుమతులు, రహదారి హద్దులు, సెట్‌బ్యాక్‌ నిబంధనలు, భవన వినియోగానికి సంబంధించిన అనుమతులను సమగ్రంగా పరిశీలించాలని కృషి కాలనీ వాసులు కోరుతున్నారు. సీజ్‌ తర్వాత నిర్మాణం ఎలా పూర్తయింది, ప్రస్తుతం భవనం ఏ అనుమతుల ఆధారంగా వినియోగంలో ఉందన్న అంశాలను అధికారులు బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram