Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు బేలా ఎస్టేట్‌లో 728 మందిలో 727 ఓట్లు తొలగించారూ..!

2024, 2025 ఎన్నికల్లో ఓటేసిన వారికే ఇప్పుడు పేర్లు లేవంటూ ఆరోపణ నిరాశ్రయ ఓటర్లకు ‘హౌస్‌ నంబర్‌-0’ విధానం ఉందన్న రాహుల్‌
SAI MANIKANTA
September 29, 2026 · 10 hours క్రితం
◉ 11 Views ↗ 1 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి):

ఢిల్లీలోని యమునా తీరంలోని బేలా ఎస్టేట్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) అనంతరం 728 మంది నివాసితుల్లో 727 మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ఒక్కరి పేరు మాత్రమే జాబితాలో ఉందని ఆయన పేర్కొన్నారు.

బేలా ఎస్టేట్‌ ప్రాంతాన్ని సోమవారం సందర్శించిన రాహుల్‌ గాంధీ స్థానికులతో మాట్లాడారు. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నామని, 2024 లోక్‌సభ, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ ఎస్‌ఐఆర్‌ తర్వాత తమ పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2023లో ఇళ్లు కూల్చివేసినా తాము అదే ప్రాంతంలో కొనసాగుతున్నామని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు.

‘ఇల్లు లేకపోవడం ఓటు హక్కుకు అడ్డంకి కాదు’
నిరాశ్రయ ఓటర్ల కోసం ఎన్నికల వ్యవస్థలో ‘హౌస్‌ నంబర్‌-0’ విధానం ఉందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ఈ అంశంపై స్థానిక సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)తో రాహుల్‌ గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. ఇల్లు లేకపోవడం ఓటు హక్కుకు అడ్డంకి కాదని, నిరాశ్రయ ఓటర్ల కోసం ‘హౌస్‌ నంబర్‌-0’ విధానం ఉందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ 727 మంది పేర్లు ఎలా తొలగించారో వివరించాలని ప్రశ్నించారు.

కాగా, బేలా ఎస్టేట్‌ను కవర్‌ చేసే ఒక పోలింగ్‌ భాగానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో 729 మంది ఓటర్లలో 728 మంది పేర్లు లేకపోయినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే రాహుల్‌ గాంధీ మాత్రం అక్కడ 728 మంది నివాసితుల్లో ఒక్కరి పేరు మాత్రమే మిగిలిందని ఆరోపించారు. పేర్లు తొలగింపుపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియను అందుబాటులో ఉంచింది.

ఎస్‌ఐఆర్‌పై ఇప్పటికే రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఓటర్ల జాబితా మార్పులకు సంబంధించి ఎన్నికల సంఘం అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని పేర్కొంటోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram