ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఫార్మా కంపెనీల ఎదుట ధర్నా
బిక్కనూరుకు మంజూరైన రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇప్పటికే కామారెడ్డి మండల పరిధిలోని క్యాసంపల్లికి తరలించడాన్ని నిరసిస్తూ బిక్కనూరు వార్డు సభ్యులు కెమికల్ కంపెనీల ఎదుట ధర్నా నిర్వహించారు. కెమికల్ కంపెనీల కారణంగానే స్కూల్ తరలిపోయిందని ఆరోపించిన వారు.. బిక్కనూరులోని మూడు కంపెనీలను తరిమికొట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను బిక్కనూరులోనే సాధించుకోవాలని డిమాండ్ చేశారు.
బిక్కనూరులో గతంలో రెండు స్థలాలను అధికారులు పరిశీలించినప్పటికీ అవి పాఠశాల ఏర్పాటుకు అనువుగా లేవని పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో స్కూల్‌ను ఇతర ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో.. ఇక బిక్కనూరు మండల పరిధిలోనే ప్రత్యామ్నాయ స్థలాలపై మరోసారి విస్తృతంగా పరిశీలన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా బస్వాపూర్ నుంచి జంగంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి వెంట ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు అనువైన స్థలాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు. రవాణా సౌకర్యం – భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరైన స్థలాన్ని గుర్తించి అక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో 14వ వార్డు మెంబర్ జ్ఞాన ప్రకాష్ రెడ్డి జాయింట్ డైరెక్టర్ శ్రీమతి బి. వెంకట నరసమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. బిక్కనూరు గ్రామానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇతర ప్రాంతానికి తరలించకుండా బిక్కనూరులోనే ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఇప్పటికే క్యాసంపల్లికి తరలించిన రూ.200 కోట్ల విద్యా ప్రాజెక్టును తిరిగి బిక్కనూరు మండలంలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించి, అనువైన స్థలాన్ని ఎంపిక చేసి బిక్కనూరులోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ధర్నాలో వార్డు సభ్యులు కర్రోళ్ల రాజు, గజ్జ వేణు, దుభాష్ పంచాక్షరి, ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.






