Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

పాత్రికేయులు నిబద్ధతతో పనిచేయాలి…పోచారం శ్రీనివాసరెడ్డి

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి.. వాస్తవాలను నిర్ధారించాలి
SAI MANIKANTA
September 29, 2026 · 2 minutes క్రితం
◉ 2 Views ↗ 1 Shares

­బాన్సువాడ, సెప్టెంబర్‌ 29 (నవజ్యోతి ప్రతినిధి):

బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతులు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభ సమావేశానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

వాస్తవాలను నిర్ధారించాలి
జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంతో పాటు సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో విలేఖరుల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి ఆశలు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఒక వార్త సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా విస్తరణతో మీడియా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని పోచారం పేర్కొన్నారు. జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎనిమిదేళ్ల క్రితమే బాన్సువాడలో సుమారు 60 మంది రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేశామని గుర్తుచేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రతకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

శిక్షణలో కీలక అంశాలు
మొదటి రోజు సమాచార హక్కు చట్టం, నేర వార్తల రచన, వార్తా కథనాలు, ఫేక్‌ న్యూస్‌, సైబర్‌ క్రైమ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సోషల్‌ మీడియా తదితర అంశాలపై సీనియర్‌ జర్నలిస్టులు దిలీప్‌రెడ్డి, గోవిందరెడ్డి, మార్కండేయ, ముత్తేవి నరసింహస్వామి తదితరులు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో రోజు మీడియా చట్టాలు, నైతిక నియమావళి, భాషలో దొర్లే తప్పులు, గ్రామీణ వార్తలు, మానవ అక్రమ రవాణా నివారణ తదితర అంశాలపై కె. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌. ఉమామహేశ్వరరావు, తోట భావనారాయణ, కె. యెషయా అవగాహన కల్పించనున్నారు.

బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఇతర అధికారులతో జర్నలిస్టుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ (ఐఏఎస్‌), జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర (ఐపీఎస్‌) గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

రెండు రోజుల శిక్షణ ద్వారా జర్నలిస్టులకు వృత్తిపరమైన పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతపై అవగాహన పెరగడంతో పాటు వార్తల సేకరణ, పరిశీలన, రచనలో మరింత నైపుణ్యం పెంపొందేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram