గురువుల సేవలకు ఘన గౌరవం
పటాన్‌చెరు, సెప్టెంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి):
భావి భారత పౌరులను తీర్చిదిద్దే నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. పటాన్‌చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పాండు పేర్కొన్నారు. డీఈఓ రోహిణి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల బాధ్యత కీలకమన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ‘గురువులకు పాదాభివందనం’ ప్రదర్శనకు ఎమ్మెల్యే రూ.26 వేల నగదు బహుమతి అందజేశారు.






