గిరిజన రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి (నవజ్యోతి ప్రతినిధి): పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాకు చెందిన లంబాడీ గిరిజన రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కోరారు. ఈ మేరకు కోల గోపాల్, జ్ఞానేశ్వర్ ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు. తరతరాలుగా గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటున్న సుమారు 200 ఎకరాల భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో సమస్యలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఏళ్ల తరబడి ఈ భూములనే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు తెలిపారు. భూముల వాస్తవ సాగుదారులు ఎవరనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన గిరిజన రైతుల హక్కులను పరిరక్షించాలని కోరారు. తమకు తెలియకుండానే ఇతరుల పేర్లపై పట్టాదార్ పాస్‌బుక్‌లు, రెవెన్యూ రికార్డులు నమోదైనట్లు ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి నిజమైన సాగుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల వినతిని విన్న హుస్సేన్ నాయక్ సమస్యను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి భూ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.






