కామారెడ్డి ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు!
తన ఫైల్ ప్రక్రియ కోసం జిల్లా సూపరింటెండెంట్ భీమరాజు – జూనియర్ అసిస్టెంట్‌కు రూ.5 వేల చొప్పున ఇచ్చినట్లు జ్యోతి ఆరోపించారు. డబ్బులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు తన పని పూర్తి చేయలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహించిన జ్యోతి ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ పొందారు. తనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు – ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు. అయితే కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫైల్ కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ విరమణ ప్రయోజనాల ప్రక్రియ పూర్తికాకపోవడంతో పెన్షన్ అందడం లేదని జ్యోతి తెలిపారు. దీంతో బ్యాంకు రుణాల చెల్లింపులు – కుటుంబ ఆర్థిక అవసరాలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్ర అసహనానికి గురైన జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయానికి చేరుకుని సూపరింటెండెంట్ భీమరాజును నిలదీశారు. జూనియర్ అసిస్టెంట్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్లోనే ప్రశ్నించారు. దీంతో కార్యాలయంలో కొంతసేపు వాగ్వాద వాతావరణం నెలకొంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తోటి ఉద్యోగులు కల్పించుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఫైల్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో జ్యోతి తన ఆందోళనను విరమించారు.
రిటైర్డ్ ఉద్యోగి చేసిన డబ్బుల డిమాండ్ – చెల్లింపుల ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి వాస్తవాలను పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.





