Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

స్టీఫెన్ రవీంద్ర బదిలీ వెనుక మిల్లర్ల మతలబేంటి?

సీఎంఆర్ అక్రమాలపై ఉక్కుపాదం..కీలక దశలోనే స్థానచలనం.
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 16, 2026 · 2 weeks క్రితం
◉ 14 Views ↗ 0 Shares

హైదరాబాద్, నవంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర బదిలీ మాత్రం ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అక్రమాలు, ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడం, బియ్యం బకాయిల వసూళ్ల వ్యవహారాలపై ఆయన కఠినంగా వ్యవహరించారు. మిల్లులపై వరుస తనిఖీలు, నిల్వల పరిశీలన, నోటీసులు, క్రిమినల్ కేసుల నమోదుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో ఆయనను పౌరసరఫరాల శాఖ నుంచి బదిలీ చేయడం వెనుక పరిపాలనా కారణాలే ఉన్నాయా? లేక అక్రమాలపై కొరడా ఝళిపిస్తున్న అధికారిని తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. ధాన్యం నిల్వల భౌతిక పరిశీలన, విజిలెన్స్ తనిఖీలు, మిల్లర్లకు నోటీసులు, బకాయిల వసూళ్లతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలకు ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా సన్నరకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి, ఎఫ్‌సీఐకి తక్కువ ధర కలిగిన దొడ్డురకం బియ్యం సరఫరా చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అక్టోబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మూడు కేసుల్లో 14 మంది మిల్లర్లు అరెస్టు కావడం మిల్లింగ్ రంగంలో సంచలనంగా మారింది. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 మిల్లుల నుంచి సుమారు 3,385 మెట్రిక్ టన్నుల దొడ్డురకం బియ్యం సరఫరా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించగా, బోనస్ చెల్లింపుల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.సీఎంఆర్ అక్రమాలపై విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ మిల్లింగ్ వర్గాల్లో ఆందోళన పెరిగిందన్న ప్రచారం ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం బకాయిలు, అక్రమ సరఫరాలపై చర్యలు మరింత కఠినమైతే భారీ ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు మిల్లర్లు భావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలుకుబడి కలిగిన మిల్లింగ్, వ్యాపార వర్గాలు తమ రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న బడా మిల్లర్లు స్టీఫెన్ రవీంద్ర బదిలీ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.స్టీఫెన్ రవీంద్ర బదిలీతో సీఎంఆర్ వ్యవహారాల్లో ఇప్పటివరకు కొనసాగిన దూకుడు తగ్గుతుందా? ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం బకాయిల వసూళ్లు, అక్రమాలపై నమోదైన కేసుల దర్యాప్తు, బాధ్యులపై చర్యలు అదే స్థాయిలో కొనసాగుతాయా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అధికారి మారినా అక్రమాలపై చర్యలు ఆగకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బదిలీ వెనుక కారణాలపై నెలకొన్న సందేహాలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు, సీఎంఆర్ అక్రమాలపై విచారణను పారదర్శకంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram