Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

శ్రీచరణికి మరో అరుదైన రికార్డు

LAXMAN
LAXMAN
September 16, 2026 క్రీడలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (నవజ్యోతి): మహిళల ఆసియా కప్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 800కుపైగా రేటింగ్‌ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో శ్రీచరణి అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇటీవల దుబాయ్‌లో ముగిసిన మహిళల ఆసియా కప్‌లో శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ఆమె.. ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీసి భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో ఆమె ర్యాంకింగ్‌ పాయింట్లు భారీగా పెరిగి 804కు చేరాయి.

శ్రీచరణి తర్వాత భారత్‌కే చెందిన ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ 729 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇద్దరి మధ్య ఏకంగా 75 పాయింట్ల వ్యత్యాసం ఉంది. దీంతో అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి ఆధిపత్యం ఎంతగా ఉందో అర్థమవుతోంది.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే శ్రీచరణి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2025 జూన్‌ 28న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆమె.. అద్భుతమైన స్పిన్‌తో వరుస విజయాల్లో కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె నిలకడైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.

గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ శ్రీచరణి తన స్పిన్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఆ టోర్నీలో 14 వికెట్లు తీసి భారత్‌ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీచరణి తాజాగా 800 రేటింగ్‌ పాయింట్ల మైలురాయిని అందుకుని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.