పోస్టల్ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు
జాహిరాబాద్, అక్టోబర్ 23 (నవజ్యోతి ప్రతినిధి) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో ప్రత్యేక తపాలా సేవల గ్రామ సభను శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ బి. రత్నయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ” డాక్ చౌపాల్ ” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. పోస్టల్ శాఖ లో విప్లవాత్మకమైన సంస్కరణలలో భాగంగా అనేక కార్యక్రమలను చేపడుతున్నామని తెలిపారు. పోస్టాఫీసు లో మంచి పొదుపు పథకాలు ఉన్నాయని వీటిని ప్రజలు సద్వినియోగపర్చుకొని లబ్ది పొందాలని సూచించారు. బ్యాంకుల కంటే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసు కోవడం, వివిధ పోస్టల్ పథకాల గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పోస్టల్ ఇన్స్పెక్టర్ బి. రత్నయ్య వివరించారు. డాక్ చౌపాల్ గ్రామ సభలో జహీరాబాద్ ఎచ్ వో పోస్ట్మాస్టర్ సుభాష్, సబ్ డివిజన్ ఎం వో డి.శ్రీనివాస్, పోస్టల్ అసిస్టెంట్ లు శ్రీశైలం, దేవరాజ్ , వెంకటదాస్ , సాయిలు , సృష్టి , అశ్వినీ, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, తపాలా సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.






