‘రామాయణం’ తొలి పోస్టర్ విడుదల.
ముంబయి, సెప్టెంబరు 14 ( నవజ్యోతి వెబ్): భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రామాయణం మరోసారి వెండితెరపై సరికొత్త రూపంలో ఆవిష్కృతమవుతోంది. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రామాయణం’ అనే పేరునే ఖరారు చేశారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. సీతారాములుగా రణ్‌బీర్, సాయిపల్లవి వినాయక చవితి సందర్భంగా చిత్రబృందం ‘రామాయణం’ తొలి పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సీతారాములుగా రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవిని చూపించారు. సుమారు 30 సెకన్ల వీడియోను కూడా విడుదల చేయగా.. సినిమాలో ఆవిష్కరించబోయే భారీ ప్రపంచానికి చిన్న పరిచయం మాత్రమే ఇచ్చారు. పూర్తి వివరాలను వెల్లడించకుండా ఆసక్తిని పెంచేలా వీడియోను రూపొందించారు. రెహమాన్ సంగీతం.. జిమ్మర్ భాగస్వామ్యం
‘రామాయణం’ తొలి పాటపై కూడా చిత్రబృందం ప్రకటన చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘జై జై రామ్’ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రెహమాన్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
భారీ తారాగణంతో రెండు భాగాలుగా రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవితో పాటు యశ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, రవి దూబే, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యశ్ నటించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ తొలి భాగాన్ని 2026 నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.





