జీతంలో పీఎఫ్ కట్.. ఖాతాలో జమైందా?
చాలామంది ఉద్యోగులు జీతం స్లిప్‌లో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తం మినహాయించినట్లు కనిపించగానే.. ఆ డబ్బు ఈపీఎఫ్ఓ ఖాతాలో జమైందని భావిస్తుంటారు. కానీ జీతంలో పీఎఫ్ కోత విధించడం, ఆ మొత్తాన్ని ఈపీఎఫ్ఓకు జమ చేయడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటాను కూడా నిర్ణీత గడువులోగా ఈపీఎఫ్ఓకు జమ చేయాల్సి ఉంటుంది.
పాస్‌బుక్‌లో చెక్ చేసుకోవచ్చు
పీఎఫ్ మొత్తం జమ అవుతోందో లేదో తెలుసుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో ఈపీఎఫ్ఓ సభ్యుల పాస్‌బుక్‌ను పరిశీలించవచ్చు. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ సేవలో యూఏఎన్, పాస్‌వర్డ్‌తో ప్రవేశించి ప్రస్తుత యజమాని మెంబర్ ఐడీని ఎంచుకోవాలి. అక్కడ ప్రతి నెలా జమ అయిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, పింఛను పథకం వాటా వివరాలు కనిపిస్తాయి. వీటిని జీతం స్లిప్‌తో సరిపోల్చి చూడటం ద్వారా పీఎఫ్ జమైందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.
జమ కాకపోతే ముందుగా హెచ్ఆర్కు..
నిర్ణీత గడువు దాటినా పీఎఫ్ మొత్తం పాస్‌బుక్‌లో కనిపించకపోతే ముందుగా సంస్థలోని మానవ వనరుల విభాగం లేదా జీతాల విభాగాన్ని సంప్రదించాలి. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ దాఖలు చేశారా? పీఎఫ్ మొత్తాన్ని చెల్లించారా? అనే వివరాలను అడిగి తెలుసుకోవాలి. కంపెనీ నుంచి సరైన స్పందన రాకపోతే ఈపీఎఫ్ఓ ఫిర్యాదు వ్యవస్థ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే జీతం స్లిప్‌లు, ఇతర ఆధారాలను సమర్పించాలి.
ఆలస్యమైనా వడ్డీకి నష్టం లేదు
ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ మొత్తాన్ని మినహాయించి, దాన్ని ఈపీఎఫ్ఓకు జమ చేయడంలో యజమాని విఫలమైతే నిబంధనల ప్రకారం వడ్డీ, జరిమానా విధించే అవకాశం ఉంది. ఆలస్యంగా పీఎఫ్ జమ చేసినా ఉద్యోగికి రావాల్సిన వడ్డీకి నష్టం వాటిల్లదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి నెలకు సంబంధించిన పీఎఫ్ మొత్తాన్ని ఆ నెల ముగిసిన తర్వాత 15 రోజుల్లోగా యజమాని జమ చేయాలి. అందువల్ల ఉద్యోగులు తమ పాస్‌బుక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది.





