Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

చదువుపై పట్టుదల… జగ్గారెడ్డి నుంచి భరోసా

LAXMAN
LAXMAN
September 12, 2026 సంగారెడ్డి

సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నవజ్యోతి ప్రతినిధి) :

కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో నిలిచిపోయిన చదువును తిరిగి కొనసాగించాలనే పట్టుదలతో ఓ విద్యార్థిని వినూత్నంగా తన సమస్యను జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. రాయికోడ్ మండలం కప్పాడ్ గ్రామానికి చెందిన భవాని పది రోజుల పాటు శ్రమించి థ్రెడ్ ఆర్ట్‌తో జగ్గారెడ్డి చిత్రపటాన్ని రూపొందించి ఆయనకు బహూకరించింది. భవాని మోడల్ స్కూల్‌లో విద్యనభ్యసించి ప్రస్తుతం అసోసియేటెడ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ACCA) కోర్సు చదువుతోంది. ఇప్పటికే ఫస్ట్ లెవల్ పూర్తి చేసిన ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆరు నెలలుగా చదువుకు దూరంగా ఉంటోంది. తల్లిదండ్రులకు చెందిన రెండున్నర ఎకరాల భూమి గత 12 సంవత్సరాలుగా వివాదంలో ఉండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న భూమి సమస్య పరిష్కారమైతే తన చదువును కొనసాగించవచ్చని భావించిన భవాని జగ్గారెడ్డిని కలవాలని నిర్ణయించుకుంది.

చిన్నప్పటి నుంచి ఆర్ట్‌పై ఆసక్తి ఉన్న భవాని ఇంటర్నెట్ ద్వారా థ్రెడ్ ఆర్ట్ నేర్చుకుని, పది రోజుల పాటు శ్రమించి జగ్గారెడ్డి చిత్రపటాన్ని రూపొందించింది. చేర్యాల ఆంజనేయులు, చిమ్నాపూర్ ప్రకాష్, పాస్టర్ మోజెస్ సహకారంతో తల్లిదండ్రులతో కలిసి జగ్గారెడ్డిని కలిసింది. తన చదువు, కుటుంబ పరిస్థితి, భూమి సమస్యను ఆయనకు వివరించింది. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో మాట్లాడి భూమి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. చదువును మధ్యలో ఆపకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలని భవానిని ప్రోత్సహించారు.