Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
రంగారెడ్డి

మంగల్‌పల్లిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు: అనుమతులు ఒకలా.. కట్టడాలు మరోలా!

November 22, 2026 · 6 days క్రితం
◉ 12 Views ↗ 0 Shares

ఇబ్రహీంపట్నం , నవంబర్ 22(నవ జ్యోతి ప్రతినిధి )మంగల్‌పల్లి పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు రోజురోజుకూ మితిమీరిపోతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఆదాయానికి భారీగా గండి కొడుతూ కొందరు యజమానులు ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తున్నారు. కేవలం ఒకటి లేదా రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కుతూ నాలుగైదు అంతస్తుల వరకు అక్రమంగా కట్టేస్తున్నారు.
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలాన్ని ఏమాత్రం వదలకుండా రహదారిని ఆనుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా, నివాస గృహాల పేరుతో అనుమతులు పొంది, వాటిని వ్యాపార సముదాయాలుగా మార్చి వినియోగిస్తున్నారు. ప్రధాన రహదారితో పాటు లోపలి నివాస ప్రాంతాలలోనూ ఈ అక్రమ కట్టడాలు వెలుస్తున్నా సంబంధిత పట్టణ ప్రణాళిక మరియు స్థానిక అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో వాహనాల నిలుపుదల సమస్యలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మంగల్‌పల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలి. అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేసి, బాధ్యులైన వారిపై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram