పోచంపల్లిలో అయ్యప్ప స్వామి 22వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
భూదాన్ పోచంపల్లి:
తెలంగాణ శబరిమల క్షేత్రంగా విరాజిల్లుతున్న పోచంపల్లి పట్టణంలోని స్వర్ణ ధ్వజస్తంభ అయ్యప్ప స్వామి దేవాలయంలో 22వ వార్షిక ద్వవింశతి బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యప్ప స్వామి భక్త సమాజం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శనివారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజా దీక్షలు కొనసాగుతున్నాయని, దీక్షాపరుల కోసం ప్రతిరోజూ మధ్యాహ్నం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా డిసెంబర్ 3న స్వర్ణ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబర్ 6న అత్యంత విశేషంగా లక్ష్య పుష్పార్చన, మహా పడిపూజతో పాటు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 15న ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములు, మాలధారణ చేసిన దీక్షాపరులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో యెన్నం శివకుమార్, దొంత సుదర్శన్, జెల్ల వెంకటేశం, గంగాపురం వెంకటేశం, రాపోలు జ్ఞానేశ్వర్, బొడిగే బాబు గౌడ్, రచ్చ రామకృష్ణ, మక్తాల సత్యనారాయణ గౌడ్, కర్నాటి నరసింహ, తన్నీరు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






