జగిత్యాల, అక్టోబర్ 8 (నవజ్యోతి ప్రతినిధి):
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన “జిమ్ జిమ్ తారా..” పాటను తమ నిరసనకు వేదికగా మార్చుకున్నారు జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు. కళాశాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు “జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా?” అంటూ పాటకు అనుగుణంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సాధారణ ఆందోళనలకు భిన్నంగా సోషల్ మీడియాలో ఊపేస్తున్న పాటను తమ సమస్యతో ముడిపెట్టడంతో ఈ నిరసన ప్రత్యేక ఆకర్షణగా మారింది.
“జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా?”
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాటనే తమ సమస్యను ప్రశ్నించే నినాదంగా మార్చుకుని విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
నాలుగేళ్లుగా సమస్యలే..
వైద్య విద్యకు అవసరమైన శాశ్వత తరగతి గదులు, ఆధునిక ల్యాబ్‌లు, హాస్టల్, మెస్, రవాణా, క్రీడా సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితంగా ఉన్న తరగతి గదులు, ల్యాబ్‌లతో ఐదేళ్ల వైద్య విద్యను ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణకు కూడా తగిన సదుపాయాలు లేవని పేర్కొన్నారు.
ఆస్పత్రికి 5 కిలోమీటర్లు.. రవాణా కష్టాలు
వైద్య విద్యలో భాగంగా మాతా శిశు విభాగం, క్రిటికల్ కేర్ విభాగంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని విద్యార్థులు తెలిపారు. అయితే కళాశాల నుంచి ఆసుపత్రి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.
600 మంది విద్యార్థులకు మెస్ సమస్య
గర్ల్స్ హాస్టల్‌లోనూ సమస్యలు ఉన్నాయని విద్యార్థినులు తెలిపారు. సుమారు 600 మంది విద్యార్థులకు సరిపడా మెస్ సౌకర్యం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్, భోజన సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతున్నారు.
అధికారులకు చెప్పినా పరిష్కారం లేదంటూ..
తమ సమస్యలను గతంలో ఎమ్మెల్యే, డీఎంహెచ్‌వోతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు తెలిపారు. పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరింత వేగం పెంచాలని కోరుతున్నారు.
శాశ్వత భవనం కోసం డిమాండ్
శాశ్వత తరగతి గదులు, ఆధునిక ల్యాబ్‌లు, హాస్టల్, మెస్, రవాణా, క్రీడా సదుపాయాలను వెంటనే కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వైద్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం – అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
శాశ్వత భవనం సహా మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఈ నిరసనలో “జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా?” అనే నినాదం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటతో సాగిన నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.