వరాహి దేవి ఒడిలో గణపయ్య.. లాల్‌దర్వాజాలో ప్రత్యేక ఆకర్షణ!
ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షుడు సచిన్ చందన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది విగ్రహానికి ‘గణేశుడు వరాహి దేవి ఒడిలో’ అనే థీమ్‌ను ఎంపిక చేశారు. హైదరాబాద్, తెలంగాణలో వరాహి దేవి దర్శనం అందరికీ సులభంగా లభించకపోవడంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతో ఈ రూపాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ప్రతి ఏడాది విభిన్న సందేశం, థీమ్‌తో పర్యావరణహిత గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈసారి కూడా సహజసిద్ధమైన, పర్యావరణానికి అనుకూలమైన విధానంలో విగ్రహాన్ని రూపొందించారు.
భారీ విగ్రహ నిర్మాణ పనులు ఉత్సవాలకు నెల రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. విగ్రహ రూపకల్పన కోసం కోల్‌కతా నుంచి కళాకారులు వచ్చి పనిచేస్తారు. సుమారు ఆరుగురు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ 20 నుంచి 25 రోజుల్లో విగ్రహానికి తుది రూపాన్ని ఇస్తారని సచిన్ చందన్ తెలిపారు.
విభిన్నమైన ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన ఈ గణపతి విగ్రహం లాల్‌దర్వాజా ప్రాంతంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గణేశుడితో పాటు వరాహి దేవి రూపాన్ని ఒకే విగ్రహంలో దర్శించుకునే అవకాశం లభించడంతో భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.





