రంగారెడ్డి జిల్లా ఎల్‌పీజీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక,
ఇబ్రహీంపట్నం నవంబర్ 20, (నవ జ్యోతి ప్రతినిధి) రంగారెడ్డి జిల్లా ఎల్‌పీజీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. నూతన కార్యవర్గంలో అధ్యక్షురాలిగా పుంజాల రాధికాదేవి, ఉపాధ్యక్షుడిగా రవికాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శాంత, కోశాధికారిగా అనురాధ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నిక అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో ఎల్‌పీజీ పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు పుంజాల రాధికాదేవి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన ఎల్‌పీజీ సేవలు అందించడంతో పాటు, బ్లాక్ మార్కెటింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం, సరఫరాలో ఎదురయ్యే సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం తమ ప్రధాన లక్ష్యాలని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వానికి, పౌరసరఫరాల శాఖకు పూర్తి సహకారం అందిస్తూ.. ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామని అధ్యక్షురాలు స్పష్టం చేశారు. ఎల్‌పీజీ పంపిణీలో పారదర్శకతను పెంపొందించేందుకు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని ఆమె వివరించారు.






