మనోహరాబాద్, అక్టోబర్ 29 (నవజ్యోతి ప్రతినిధి నవీన్)
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే ఆ రైతు మనసు తల్లడిల్లింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి, కుటుంబ పోషణపై పెట్టుకున్న ఆశలు నీరుగారుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన సాదు నర్సింలు తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈసారి వరి సాగు చేసినా వర్షాలు లేకపోవడం, బోరులో నీరు అందకపోవడంతో పంట ఎండిపోతుండటాన్ని చూసి దిగులుచెందాడు. పంట చేతికందకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలనే ఆందోళనతో ఉన్న నర్సింలుకు గురువారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. రోజూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండే నర్సింలు ఆకస్మికంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. పంట నష్టంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఎండిన పంటతో మొదలైన ఆవేదన.. కుటుంబాన్ని కన్నీటిలో ముంచిన విషాదం
నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజల పక్షం • ప్రజా స్వరం