చైనాలో క్రికెట్‌కు భారీ మార్కెట్!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా చైనాను కీలక మార్కెట్‌గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పరిగణిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్‌కు పైగా క్రికెట్ అభిమానుల్లో దాదాపు 90 శాతం దక్షిణాసియాలోనే ఉన్నారని ఐసీసీ పేర్కొంది. ఈ అభిమాన వర్గాన్ని మరో 50 కోట్ల మందికి విస్తరించాలన్న లక్ష్యంతో కొత్త మార్కెట్లపై దృష్టి సారిస్తోంది.
140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా క్రికెట్‌కు భారీ అవకాశాలను అందించగల దేశంగా ఐసీసీ భావిస్తోంది. చైనా మహిళల జట్టు ఇటీవలి కాలంలో సాధిస్తున్న పురోగతి దేశంలో క్రికెట్‌కు ఆసక్తిని పెంచుతోందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా తెలిపారు.
2022లో హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో క్రికెట్ నిర్వహణతో చైనా ఐసీసీ దృష్టిలో కీలక మార్కెట్‌గా మారింది. గత రెండేళ్లలో చైనా మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10 స్థానాలు మెరుగుపడింది. అయితే టీ20 ర్యాంకింగ్స్‌లో మహిళల జట్టు 36వ స్థానంలో, పురుషుల జట్టు 92వ స్థానంలో కొనసాగుతోంది.
తాజా ఆసియా క్రీడల్లోనూ చైనా మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
చైనాలో క్రికెట్ అభివృద్ధికి గత ఐదేళ్లలో ఐసీసీ సుమారు 15 లక్షల డాలర్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అక్కడ మూడు అత్యున్నత స్థాయి క్రికెట్ వేదికలు ఉన్నాయి. తైకాంగ్‌లో కొత్తగా నిర్మించిన 1,500 సీట్ల స్టేడియం దేశీయ – అంతర్జాతీయ మ్యాచ్‌లకు, జాతీయ జట్ల శిక్షణకు ఉపయోగపడనుంది.
చైనాలో క్రికెట్‌పై ప్రేక్షకుల ఆసక్తిని పరీక్షించే ప్రయత్నాలను కూడా ఐసీసీ ప్రారంభించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లను మాండరిన్ భాషలో ప్రసారం చేసింది. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్ చివరి వారంలో చైనాలో 44 లక్షల వీడియో వీక్షణలు నమోదయ్యాయి.
చైనాతో పాటు సుమారు 28 కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియాను కూడా క్రికెట్ అభివృద్ధికి అవకాశమున్న మార్కెట్‌గా ఐసీసీ గుర్తించింది. ఇండోనేషియా పురుషుల టీ20 జట్టు 63వ ర్యాంక్‌లో, మహిళల జట్టు 23వ ర్యాంక్‌లో ఉంది.
చైనా – ఇండోనేషియాలోని జనాభాలో కొంత భాగం క్రికెట్‌తో అనుసంధానమైతే, ప్రపంచ క్రికెట్ అభిమానుల సంఖ్యను గణనీయంగా పెంచే అవకాశం ఉందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు. ప్రపంచ అభిమానులను మరో 50 కోట్ల మందికి పెంచాలన్న ఐసీసీ లక్ష్యంలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు.
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశించడం కూడా ఈ విస్తరణకు మరింత ఊతమిస్తుందని ఐసీసీ భావిస్తోంది. పురుషుల – మహిళల టీ20 పోటీల్లో పతకాలు అందించనున్నారు. 1900 తర్వాత తొలిసారిగా క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో పతక పోటీలు జరగనున్నాయి.
చైనాలో క్రికెట్ అభివృద్ధికి మేరిలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా మద్దతు ప్రకటించింది. 2027లో చైనాలో మహిళల జట్టు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు ఎంసీసీ క్రికెట్ – ఆపరేషన్స్ డైరెక్టర్ రాబ్ లించ్ తెలిపారు. ఈ పర్యటన చైనాలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు మంచి అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు.






