హస్మత్పేట్ సర్వే నంబర్ 1 లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు
ఎమ్మార్వో,హైడ్రా అధికారుల మౌనం ఎందుకు..?
అల్వాల్/నవంబర్ 15, (నవజ్యోతి ప్రతినిధి): హస్మత్పేట్ చత్రిగడ్డ పరిధిలోని సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమిగా గుర్తించిన సుమారు 12 ఎకరాల స్థలంలో మళ్లీ నిర్మాణాలు జోరందుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని పేర్కొన్న ఎమ్మార్వో,హైడ్రా అధికారులు భారీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విపత్తు నిర్వహణ బలగాలతో పాటు సుమారు 100 నుంచి 500 మంది సిబ్బందిని రంగంలోకి దించి భూమిని కాపాడే చర్యలు చేపట్టారు.అంతేకాకుండా కొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేశారు.అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగిపోగా అదే స్థలంలో 20కి పైగా ఇళ్లు భవనాలు నిర్మితమయ్యాయి. మరికొన్ని నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.రాత్రి వేళల్లోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని బోర్లు వేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ నిర్మాణాలపై ప్రశ్నించగా గతంలో హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పై కోర్టు స్టే విధించిందని ఆ స్టే తొలగిపోవడం తోనే తాము నిర్మాణాలు చేపడుతున్నామని కొందరు స్థానికులు చెబుతున్నట్లు తెలుస్తోంది.అయితే నిజంగానే 12 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి కోర్టు స్టే తొలగించిందా స్టే తొలగితే ఆ భూమి యాజమాన్య హక్కులపై ఏమైనా మార్పులు వచ్చాయా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు ప్రభుత్వ భూమి అని ప్రకటించి,ఫెన్సింగ్ ఏర్పాటు చేసి,నిర్మాణాలను కూల్చివేసిన అధికారులే ఇప్పుడు అదే భూమిలో జరుగుతున్న నిర్మాణాలు,బోర్ల తవ్వకాలు రిజిస్ట్రేషన్లపై ఎందుకు స్పందించడం లేదన్నది ప్రజల ప్రశ్న.ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు బోర్లకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు.రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి.గతంలో భూమిని కాపాడేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించిన అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు.ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారుల పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతున్నాయా లేక నిర్మాణదారులకు అధికారులకు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.అధికారులు మౌనం వహించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిగా ప్రకటించిన అదే సర్వే నంబర్ 1లో నేడు ఇంత పెద్ద సంఖ్యలో నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి.కోర్టు స్టే తొలగిందన్న వాదనలో వాస్తవమెంత ప్రభుత్వ భూమి విషయంలో అప్పట్లో చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.ఈ అంశాలపై ఎమ్మార్వో,హైడ్రా సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.






