పోలీసు వాహనాన్ని ఢీకొని తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ కన్నుమూత
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 21, 2026 · 1 week క్రితం
◉ 9 Views↗ 0 Shares
గజ్వేల్, అక్టోబర్ 21 (నవజ్యోతి ప్రతినిధి): దసరా పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన కమ్మరి అనిల్ (19) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికొచ్చిన వయసులో కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం.. దసరా రోజున అనిల్ శ్రీగిరిపల్లి నుంచి గజ్వేల్‌కు వస్తుండగా మార్గమధ్యంలో పోలీసు వాహనాన్ని ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
అనిల్ తండ్రి చిన్నతనంలోనే మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు అనిల్ కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. పండుగ రోజున జరిగిన ఈ విషాద ఘటన కొడకండ్ల గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి