వంట నూనెల ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని భారత కూరగాయల నూనెల ఉత్పత్తిదారుల సంఘం (IVPA) అంచనా వేసింది. సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో దిగుమతి వ్యయం తగ్గే అవకాశం ఉందని, దాని ప్రభావం రిటైల్ ధరలపై కనిపించవచ్చని IVPA తెలిపింది.
పండుగల సీజన్ సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమని IVPA అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ పేర్కొన్నారు. పండుగల సమయంలో ఇళ్లలోనే కాకుండా స్వీట్లు, చిరుతిళ్లు, ఫుడ్ సర్వీస్, హోటళ్లు, రెస్టారెంట్లలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు.
ఏ నూనెపై ఎంత సుంకం తగ్గింది?
• ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ – 10% నుంచి సున్నాకు
• రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ – 32.5% నుంచి 22.5%
• ముడి సోయాబీన్ ఆయిల్ – 10% నుంచి 5%
• ముడి పామాయిల్ – 10% నుంచి 5%
• రిఫైన్డ్ సోయాబీన్, పామాయిల్ – 32.5% నుంచి 27.5%
సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకం తగ్గింపు ఎక్కువగా ఉండటంతో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని IVPA అధ్యక్షుడు తెలిపారు. దిగుమతులపై ఆధారపడే దేశీయ మార్కెట్‌లో అంతర్జాతీయ ధరలు, సరఫరా పరిస్థితులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
భారత్ తన మొత్తం వంట నూనెల అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. దీంతో అంతర్జాతీయ కమోడిటీ ధరలు, రవాణా ఖర్చులు, రూపాయి మారకం విలువ, దేశీయంగా అందుబాటులో ఉన్న నిల్వలు వంటి అంశాలు తుది రిటైల్ ధరలపై ప్రభావం చూపుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కీలకం
సుంకం తగ్గించినంత మాత్రాన రిటైల్ ధరలు అదే స్థాయిలో తగ్గుతాయని చెప్పలేమని IVPA స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలు పెరగడం, సరుకు రవాణా వ్యయం, రూపాయి విలువలో మార్పులు, దేశీయ సరఫరా-నిల్వలు వంటి అంశాలపై వినియోగదారులకు లభించే ప్రయోజనం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
మరోవైపు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) అంచనా ప్రకారం.. అక్టోబర్‌తో ముగిసే ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ వంట నూనెల దిగుమతి బిల్లు సుమారు 9 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అధిక దిగుమతి పరిమాణంతో పాటు రూపాయి విలువలో క్షీణత కూడా ఇందుకు కారణమని పేర్కొంది.
2025-26 ఆయిల్ ఇయర్‌లో నవంబర్ నుంచి ఆగస్టు వరకు భారత్ మొత్తం వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 4 శాతం పెరిగి 138.8 లక్షల టన్నులకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 133.37 లక్షల టన్నులుగా ఉన్నాయి. భారత్ ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది.