Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

స్వదేశీ యుద్ధవిమానం ‘తేజస్‌’కు కీలక ముందడుగు….. 1-2 నెలల్లో వాయుసేనలోకి తేజస్‌ Mk1A!

ఇంజిన్‌ సమస్యలు పరిష్కారం.. తుది పరీక్షలు కొనసాగుతున్నాయి : త్వరలోనే అధికారికంగా ప్రవేశపెట్టే అవకాశం - వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆశుతోష్‌ దీక్షిత్‌
SAI MANIKANTA
September 24, 2026 · 6 days క్రితం
◉ 15 Views ↗ 1 Shares

జోధ్‌పూర్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి):
భారత వాయుసేనలో స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానం ఎల్‌సీఏ తేజస్‌ Mk1A ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. ఇంజిన్ల సరఫరాకు సంబంధించిన ప్రారంభ సమస్యలు పరిష్కారమయ్యాయని, ప్రస్తుతం విమానానికి తుది దశ పరీక్షలు కొనసాగుతున్నాయని వాయుసేన వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆశుతోష్‌ దీక్షిత్‌ తెలిపారు. మరో ఒకటి-రెండు నెలల్లో తేజస్‌ Mk1Aను వాయుసేనలోకి చేర్చే అవకాశం ఉందని వెల్లడించారు.

తేజస్‌ Mk1A డెలివరీలు, సాంకేతిక పరీక్షలపై అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. తొలుత ఇంజిన్ల అందుబాటులో ఏర్పడిన సమస్యల కారణంగానే ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం అవసరమైన ఇంజిన్లు అందుబాటులోకి వచ్చాయని, వాటిని విమానాల్లో అమర్చినట్లు తెలిపారు.

తుది పరీక్షల్లో కీలక దశ
విమానాన్ని అధికారికంగా వాయుసేనకు అప్పగించే ముందు కఠినమైన ఫ్లైట్‌, సిస్టమ్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు దీక్షిత్‌ చెప్పారు. ఇంకా రెండు లేదా మూడు సాంకేతిక అంశాలను నిర్ధారించాల్సి ఉందని, అవి కూడా ఒకటి-రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘విమానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టే ముందు పూర్తి స్థాయి, సమగ్ర పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంకా రెండు-మూడు సాంకేతిక అంశాలు నిర్ధారించాల్సి ఉన్నాయి. వాటిని అధిగమించిన తర్వాత విమానాన్ని వాయుసేనలోకి చేర్చేందుకు మార్గం సుగమమవుతుంది’’ అని వైస్‌ చీఫ్‌ తెలిపారు.

స్వదేశీ యుద్ధవిమానం వాయుసేన కార్యాచరణ సామర్థ్యానికి కీలకమని పేర్కొన్న దీక్షిత్‌.. తేజస్‌ Mk1Aను వాయుసేన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానాల చేరికతో వాయుసేనలో స్వదేశీ యుద్ధవిమానాల సామర్థ్యం మరింత పెరగనుంది.

మరోవైపు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సీఎండీ రవి కుమార్‌ ఇటీవల తేజస్‌ Mk1A డెలివరీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంటిగ్రేషన్‌ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు చేయాల్సి వస్తోందని, అందువల్ల ఖచ్చితమైన డెలివరీ గడువును చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అయితే సమస్యలను త్వరలో పరిష్కరించి డెలివరీలు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇంజిన్‌ సమస్యలకు పరిష్కారం.. తుది పరీక్షలు ముమ్మరం
1-2 నెలల్లో తేజస్‌ Mk1A వాయుసేనలోకి వచ్చే అవకాశం

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram