లోత్కుంట 40 ఎకరాల భూమిపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!
లోత్కుంటలోని విలువైన 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో 219 రోజుల ఆలస్యానికి సరైన కారణం చూపలేదని ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణ హైకోర్టు 2025 అక్టోబర్‌లో వివాదాస్పద భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందుతుందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా – జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం ఆలస్యాన్ని క్షమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆలస్యానికి చూపిన కారణాలు “పూర్తిగా సరిపోవు” అని పేర్కొంటూ పిటిషన్‌ను కాలపరిమితి ముగిసిన కారణంగా కొట్టివేసింది.
విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఆలస్యానికి కొంతమంది అధికారుల తప్పిదాలు కారణమై ఉండొచ్చని తెలిపారు. దీనిపై విచారణ జరిపి అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఆలస్యానికి కారణమైన రాజ్యాంగపరమైన అధికారిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
పరిమితి చట్టాన్ని సడలింపులతో వర్తింపజేయడం వల్ల దాని నిబంధనలను పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆలస్యానికి సరైన కారణం ఉంటే అది పిటిషన్‌లోనే స్పష్టంగా ఉండాలని, తరువాత అదనపు వివరణ కోసం సమయం కోరడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
ఇదే భూమికి సంబంధించిన ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి జూలైలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వివాదాస్పద భూమికి ఫెన్సింగ్ వేశారన్న అంశంపై ఈ ఆదేశాలు వచ్చాయి.
అయితే ధిక్కరణ అప్పీల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 2న ఆ ఆదేశాలను నిలిపివేసింది. వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించకుండా హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అప్పీల్‌పై తదుపరి తుది విచారణ నవంబర్ 3న జరగనుంది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాష్ట్ర ప్రభుత్వం – న్యాయ నిపుణులు – ఇతర సంబంధిత వర్గాలతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.





