ఇరాన్ యుద్ధానికి అమెరికాకు రూ.3.6 లక్షల కోట్ల భారం!
ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధానికి భారీగా ఖర్చవుతోంది. కాంగ్రెస్‌కు చెందిన పక్షపాత రహిత బడ్జెట్ సంస్థ
కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) లెక్కల ప్రకారం ఆగస్టు 1 వరకు యుద్ధానికి
38 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.3.6 లక్షల కోట్లు ఖర్చయ్యాయి.
ఈ వ్యయం ప్రతి నెలా మరో 3 బిలియన్ డాలర్లు.. సుమారు రూ.28 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా.
యుద్ధం కొనసాగిన కొద్దీ అమెరికా రక్షణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయుధాలు, క్షిపణులు, సైనిక కార్యకలాపాలు – ఇతర ఖర్చులు ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. CBO లెక్కల ప్రకారం నెలకు సుమారు 3 బిలియన్ డాలర్ల అదనపు వ్యయం నమోదయ్యే అవకాశం ఉంది.
యుద్ధంలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయని CBO పేర్కొంది. ముఖ్యంగా కీలక క్షిపణులు – వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టర్లు వంటి ఆయుధాల నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి ఐదేళ్ల వరకు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇరాన్ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2027 తొలి మూడు నెలల్లో ద్రవ్యోల్బణం
0.5 శాతం పెరిగే అవకాశం ఉందని CBO లెక్కలు సూచిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా ఇంధన ధరలు పెరగడం కూడా దీనికి కారణంగా మారొచ్చు.
కీలక ఆయుధాల నిల్వలు తగ్గిపోవడం వల్ల మరో పెద్ద సైనిక ఘర్షణ తలెత్తితే అమెరికా స్పందించే సామర్థ్యంపై ప్రభావం పడొచ్చని CBO హెచ్చరించింది. ముఖ్యంగా చైనా – తైవాన్ మధ్య భవిష్యత్ ఉద్రిక్తతల వంటి పరిస్థితుల్లో ఇది సవాలుగా మారవచ్చని పేర్కొంది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గత జూలైలో ఆయుధ నిల్వలను తిరిగి నింపేందుకు దాదాపు
90 బిలియన్ డాలర్ల అత్యవసర నిధులు అవసరమని సెనెట్ విచారణలో తెలిపారు. నిధులు అందకపోతే కీలక లోటులు ఏర్పడతాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిలో దాడులు – అంతరాయాల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ఒత్తిడి పెరిగింది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండా సాగేది. ఇంధన ధరలు పెరగడం అమెరికా వినియోగదారులతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
CBO లెక్కల్లో ఆగస్టు 1 తర్వాత జరిగిన కొన్ని దాడుల ఖర్చులు – హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు సంబంధించిన వ్యయాలు – యుద్ధానికి అవసరమైన రుణాలపై వడ్డీ భారం పూర్తిగా చేరలేదు. అందువల్ల వాస్తవ ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది.





