ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్న భక్తులు!
ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల ప్రస్థానం సుమారు 70 ఏళ్లకు చేరింది. 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు, స్థానిక కౌన్సిలర్ సింగరి శంకరయ్య కేవలం ఒక్క అడుగు విగ్రహంతో స్థానిక గ్రంథాలయ గదిలో వినాయక చవితి వేడుకలను ప్రారంభించారు.
తొమ్మిదేళ్ల పాటు ప్రతి ఏడాది ఒక్కో అడుగు చొప్పున విగ్రహ ఎత్తును పెంచుతూ 9 అడుగుల వరకు అక్కడే పూజలు నిర్వహించారు. పదో అడుగుకు విగ్రహం పెద్దది కావడంతో గ్రంథాలయం బయట ఏర్పాటు చేశారు. అలా క్రమంగా పెరుగుతూ 2014 నాటికి విగ్రహం 60 అడుగులకు చేరింది.
భక్తుల సెంటిమెంట్, 70 ఏళ్ల ఉత్సవాల నేపథ్యంలో 70 అడుగులను బెంచ్‌మార్క్‌గా నిర్ణయించారు. ఆ సంఖ్య ఆధారంగా ఏటా విగ్రహ ఎత్తును పెంచడం లేదా తగ్గించడం జరుగుతోంది. ఈసారి 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
పెరిగిన ధరల ప్రభావంతో ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి విగ్రహ నిర్మాణ బడ్జెట్ సుమారు రూ.1.20 కోట్లకు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. 1978 నుంచి తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలోనే ఈ భారీ గణనాథుడి విగ్రహ నిర్మాణం కొనసాగుతోంది.
సాధారణంగా ఖైరతాబాద్ గణపతి నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. అయితే ఈసారి అనంత చతుర్దశి ముహూర్తం సెప్టెంబర్ 25న రావడంతో నిమజ్జనం 12వ రోజుకు వాయిదా పడింది. దీంతో భక్తులకు ఈసారి మరో రోజు బడా గణపతి దర్శనం లభించనుంది.





