ఇమ్మిగ్రేషన్ చేయకుండానే విదేశీ విమానం ఎక్కేశారు!
సెప్టెంబర్ 4న ముగ్గురు ఇటలీ ప్రయాణికులు అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. అనంతరం ఢిల్లీ నుంచి లుఫ్తాన్సా విమానంలో మ్యూనిక్ వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వారు పూర్తి చేయకుండానే కనెక్టింగ్ విమానం ఎక్కినట్లు సమాచారం.
ముగ్గురు ప్రయాణికులకు అమృత్‌సర్‌లోనే ఢిల్లీ వరకు మాత్రమే కాకుండా మ్యూనిక్ వెళ్లే లుఫ్తాన్సా విమానానికి కూడా బోర్డింగ్ పాస్‌లు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండు విమానాలు ఎయిర్ ఇండియా అమలు చేస్తున్న ‘హబ్–అండ్–స్పోక్’ విధానంలో భాగం కావు.
అందువల్ల ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రయాణికులు సాధారణంగా అరైవల్ ప్రాంతం ద్వారా బయటకు వచ్చి ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసిన తర్వాత అంతర్జాతీయ విమానాన్ని ఎక్కాల్సి ఉంది. కానీ వారిని అంతర్జాతీయ బదిలీ ప్రాంతానికి తీసుకెళ్లడంతో ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై మంగళవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, హోంశాఖ అధికారులు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కమిషనర్, ఎయిర్ ఇండియా సీఈఓ, ఢిల్లీ విమానాశ్రయ సీఈఓ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా అమలు చేస్తున్న ఈ విధానంలో అమృత్‌సర్ వంటి విమానాశ్రయాల నుంచే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసి, ఢిల్లీ వంటి హబ్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాన్ని నేరుగా ఎక్కే సదుపాయం ఉంటుంది. అయితే ఈ సదుపాయం సంబంధిత కనెక్టింగ్ విమానాలు, నిర్దిష్ట మార్గాలకు మాత్రమే వర్తిస్తుంది.





